ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. AM/NS ఇండియా (ArcelorMittal Nippon Steel) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరగనుంది. దాదాపు ₹1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ కర్మాగారం భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు ప్లాంట్‌గా నిలవనుంది.
భారత ఉక్కు రంగంలో అతిపెద్ద పెట్టుబడి
అనకాపల్లి జిల్లా, నక్కపల్లి వద్ద రూపుదిద్దుకోనున్న ఈ ఉక్కు కర్మాగారం ఆంధ్రా పారిశ్రామికాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుంది. ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో ఏటా 8.2 మిలియన్ టన్నుల (MTPA) ఉక్కును ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో నిర్మాణం ప్రారంభమవుతుంది. పూర్తిస్థాయి విస్తరణ తర్వాత ఈ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 24 MTPA కు చేరనుంది. ఈ భారీ పెట్టుబడి ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి, వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.
14 నెలల్లో రికార్డు స్థాయిలో అనుమతులు
ఆగస్టు 2024లో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించగా, కేవలం 14 నెలల రికార్డు సమయంలోనే భూమి కేటాయింపు, పర్యావరణ అనుమతులు సహా అన్ని ప్రధాన అనుమతులు మంజూరయ్యాయి. సాధారణంగా ఇటువంటి పెద్ద ప్రాజెక్టులకు రెండు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టే అనుమతి ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడం పట్ల AM/NS సీఈఓ ఆదిత్య మిట్టల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
సుస్థిరత, సాంకేతికతకు ప్రాధాన్యత
ఈ కర్మాగారం అత్యాధునిక ,కాలుష్య రహిత సాంకేతికతను ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ఛత్తీస్‌గఢ్‌లోని బైలాదిలా గనుల నుంచి ముడి ఖనిజాన్ని స్లర్రీ పైప్‌లైన్ ద్వారా తరలించేందుకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. AM/NS ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉత్తర కోస్తా ఆంధ్ర ఒక ప్రధాన ఉక్కు తయారీ మరియు పారిశ్రామిక క్లస్టర్‌గా మారనుంది.

