అఖండ 2 వాయిదా వెనుక మహేష్ బాబు సినిమాలు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన ‘అఖండ 2: తాండవం’ సినిమా హఠాత్తుగా వాయిదా పడింది.

డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా, అంతకుముందే షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోలు కూడా రద్దు కావడంతో అభిమానులు, సినీ పరిశ్రమ షాకయ్యారు.  

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మొదట “తప్పనిసరి పరిస్థితులు” మరియు “సాంకేతిక సమస్యలు” కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఈ ఊహించని నిర్ణయం వెనుక లోతైన ఫైనాన్షియల్ (ఆర్థిక) వివాదం దాగి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మహేష్ బాబు పాత సినిమాలే బాలయ్య సినిమాకు అడ్డుకట్ట.?

ఈ వివాదంలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నవి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పాత సినిమాలు ‘1: నేనొక్కడినే’ (2014) మరియు ‘ఆగడు’ (2014). ఈ చిత్రాలను గతంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఆ సంస్థకు భారీ నష్టాలు వచ్చాయి.  

ఈ ప్రాజెక్టుల విషయంలో నిర్మాణ సంస్థకు మరియు డిస్ట్రిబ్యూషన్ దిగ్గజ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (Eros International) కు మధ్య ఆర్థిక లావాదేవీలు చిక్కుముడి పడ్డాయి.

పాత అప్పుల విషయంలో ఎరోస్ సంస్థకు 14 రీల్స్ దాదాపు రూ. 28 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పుకు సంబంధించిన ఆర్బిట్రల్ అవార్డు (Arbitral Award) ఎరోస్ సంస్థకు అనుకూలంగా ఉంది. 

పరిశ్రమలో ఇలాంటి ఆర్థిక వివాదాలు సర్వసాధారణమే అయినప్పటికీ, ఒక మెగా సీక్వెల్ సినిమా విడుదల రోజున ఆగిపోవడం అభిమానులకు బాధాకరం. ఈ సమస్యను త్వరలో పరిష్కరించి, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని 14 రీల్స్ ప్లస్ సంస్థ అభిమానులకు హామీ ఇచ్చింది.

Leave a comment