అఖండ 2కి బిగ్ బ్రేక్.! ఫైనాన్స్ సమస్య క్లియర్..కానీ..!?

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఒక్కసారిగా వాయిదా పడటం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం, రిలీజ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు నిలిచిపోయింది.

బాలయ్య-బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగుతుంది. అలాంటిది, గతంలో సెన్సేషన్ సృష్టించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి.

మొదటగా, చిత్ర నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ సంస్థ ‘అనివార్య కారణాల’ వల్ల ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు, సినిమా వాయిదా పడుతున్నట్లు ప్రకటించారు. కానీ, తెర వెనుక అసలు కథ వేరే ఉందని కొద్దిసేపటికే స్పష్టమైంది. ఈ వాయిదాకు కారణం సాంకేతిక లోపం కాదు, కోర్టు వివాదమే.

₹28 కోట్ల వివాదం.. మద్రాస్ హైకోర్టు స్టే!

‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించడమే ఈ సమస్యకు మూలం. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ ఎంటిటీకి, బాలీవుడ్‌కు చెందిన ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ (Eros) సంస్థకు మధ్య పాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చిక్కు ఉంది.

గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డు ప్రకారం, ఈరోస్‌కు 14 రీల్స్ సంస్థ సుమారు ₹28 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పును ఎగవేసేందుకు ’14 రీల్స్ ప్లస్ LLP’ బ్యానర్‌పై కొత్త సినిమాను విడుదల చేస్తున్నారని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ₹28 కోట్ల అప్పును పూర్తిగా తీర్చే వరకు ‘అఖండ 2’ సినిమాను థియేటర్లలో గానీ, ఓటీటీలో గానీ, శాటిలైట్‌లో గానీ విడుదల చేయవద్దని సంచలన తీర్పునిచ్చింది.

డబ్బు చెల్లించినా తగ్గని టెన్షన్:

ఈ కోర్టు తీర్పుతో కంగుతిన్న నిర్మాతలు తక్షణమే రంగంలోకి దిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈరోస్ ఇంటర్నేషనల్‌తో పాటు, సినిమాకు ఫైనాన్స్ చేసిన ఇతర ఫైనాన్షియర్‌లకు చెల్లించాల్సిన ప్రధాన ఆర్థిక లావాదేవీలను నిర్మాతలు దాదాపుగా సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

ఆఖరి నిమిషంలో ఇలాంటి అప్పులు క్లియర్ చేయడం అంటే నిర్మాతలకు నిజంగా పెద్ద సవాలే. అందుకే, ఈ క్లిష్ట సమయంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను వంటి పెద్దలు కూడా తమ రెమ్యునరేషన్‌లో కొంత తగ్గించుకొని నిర్మాతల భుజంపై చెయ్యి వేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇది నిజంగా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అంటే!

డబ్బు సమస్య తీరిపోయినా, ఇప్పుడు అసలు టెన్షన్ మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్. ఆర్థిక వివాదం పరిష్కారమైనప్పటికీ, కోర్టు స్టే ఎత్తివేయడానికి న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ రోజు ఈ కేసు తిరిగి మద్రాస్ హైకోర్టులో విచారణకు రానుంది. కోర్టు నుంచి సానుకూల ఫలితం వస్తే, సినిమా వెంటనే విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే, ‘అఖండ 2’ మరింత ఆలస్యం అవుతుంది.

అందుకే, కోట్ల రూపాయల అప్పులు తీరిపోయినా, ఒక్క లీగల్ ఆర్డర్ కోసం బాలయ్య అభిమానులు, టాలీవుడ్ ఇండస్ట్రీ ఆందోళనగా ఎదురుచూస్తోంది. మాస్ జాతర ఎప్పుడు మొదలవుతుందో చూడాలి!

Leave a comment