‘కూలీ’ దెబ్బ: లోకేష్ కనకరాజ్ కథ వినడానికి కమల్ నో!

దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినీ ప్రయాణంలో ‘కూలీ’ సినిమా ఫలితం ఒక ఊహించని మలుపుగా మారింది. గతంలో తాను సృష్టించిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) ద్వారా లోకేష్ అద్భుతమైన ఫాలోయింగ్‌ను, స్టార్‌డమ్‌ను సంపాదించారు. అతి తక్కువ కాలంలోనే కమల్ హాసన్, విజయ్ వంటి అగ్ర హీరోలతో పనిచేసి తన సత్తా నిరూపించుకున్నారు.

అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, రజినీకాంత్‌తో చేసిన ‘కూలీ’ చిత్రంపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించినప్పటికీ, లోకేష్ మునుపటి చిత్రాల నాణ్యత, కథావిధానం ఇందులో లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమైంది. విమర్శకులు ఈ చిత్రాన్ని లోకేష్ కెరీర్‌లోనే అత్యంత బలహీనమైనదిగా పేర్కొనడంతో ‘బ్రాండ్ లోకేష్’ విలువ కొంత మేరకు తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కమల్ హాసన్ తిరస్కరణ:

‘కూలీ’ మిశ్రమ ఫలితం లోకేష్ తదుపరి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 46 ఏళ్ల తర్వాత తమిళ సినీ దిగ్గజాలైన రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించబోయే ఒక చారిత్రక చిత్రం కోసం లోకేష్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, లోకేష్ కొత్త కథను వినడానికి కూడా కమల్ హాసన్ సుముఖత చూపలేదని తెలుస్తోంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ సినిమాను నిర్మించాల్సి ఉన్నప్పటికీ, ‘కూలీ’ విమర్శల నేపథ్యంలో లోకేష్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఈ పరిణామం కారణంగా, కమల్-రజినీ చిత్రం కోసం మరో దర్శకుడిని అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మైలురాయిని ఈ విధంగా కోల్పోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

‘ఖైదీ 2’పై ఒత్తిడి:

లోకేష్ కనకరాజ్ త్వరలో తన LCU సీక్వెల్ ‘ఖైదీ 2’ ను తెరకెక్కించాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల వాతావరణం, నిర్మాణ పరమైన సమస్యలు ఈ సినిమా ప్రణాళికల్లో కూడా ఆలస్యాన్ని సృష్టిస్తున్నాయని సమాచారం. దర్శకుడుగా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి, విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వడానికి లోకేష్‌కు ‘ఖైదీ 2’ ఒక తప్పనిసరిగా  విజయం సాధించాల్సి ఉంది.సినీ పరిశ్రమలో ఒకే సినిమా ఫలితం ఎంతటి భారీ పరిణామాలకు దారితీస్తుందో చెప్పడానికి లోకేష్ కనకరాజ్ ప్రస్తుత పరిస్థితి ఒక నిదర్శనం.

Leave a comment