మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచిన యువ క్రికెటర్ శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. శ్రీచరణికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన విమర్శలకు ఈ ప్రకటన చెక్ పెట్టినట్లైంది.
తాజాగా, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం శ్రీచరణిని అభినందించారు.
సీఎం ఇచ్చిన హామీల మేరకు, శ్రీచరణికి అందించనున్న ప్రోత్సాహకాలు ఇలా ఉన్నాయి:
- గ్రూప్-1 ఉద్యోగం
- రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం
- కడపలో స్థలం కేటాయింపు
ఈ విషయాన్ని శ్రీచరణి స్వయంగా వెల్లడించారు. ప్రభుత్వం తనకెంతో ప్రోత్సాహం అందిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
వివక్ష ఆరోపణలకు చెక్
శ్రీచరణికి ప్రోత్సాహకాలు ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని, ఇతర రాష్ట్రాల క్రికెటర్లకు భారీ బహుమతులు లభించినా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఇటీవల ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, ఆమె కడప జిల్లా నివాసి, రెడ్డి సామాజిక వర్గంకు చెందినవారు కావడం వల్ల వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు రావడంతో… కూటమి సర్కార్ భారీ ప్రోత్సాహకాలను ప్రకటించి, ఆ విమర్శలకు గట్టి సమాధానం చెప్పినట్లైంది.
శ్రీచరణి స్పందన
ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ, ప్రపంచకప్‌లో గెలవడం కేవలం తొలి అడుగు మాత్రమేనని, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని అన్నారు. ప్రజల అభిమానం చూస్తుంటే తనకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. క్రీడాకారుల విషయంలో రాజకీయాలకు, సామాజిక అంశాలకు అతీతంగా ప్రోత్సాహాన్ని అందించడం మంచి పరిణామంగా క్రీడాభిమానులు హర్షిస్తున్నారు.

