శివ’ రీమేక్: చైతన్య, అఖిల్‌కు ఆ దమ్ము, ధైర్యం లేవు.. నాగార్జున కామెంట్స్!

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ‘శివ’ ఒక ట్రెండ్‌సెట్టర్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ చిత్రం, తెలుగు సినిమా గతినే మార్చేసింది. ఇప్పుడు, ఈ కల్ట్ క్లాసిక్ మూవీ నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.

ఈ రీ-రిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆర్జీవీ కలిసి మీడియాతో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో, ఒక రిపోర్టర్ కీలకమైన ప్రశ్న అడిగారు. ‘శివ’ చిత్రాన్ని నాగ చైతన్య లేదా అఖిల్ రీమేక్ చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. దానికి నాగార్జున నవ్వుతూ, సూటిగా సమాధానం ఇచ్చారు. “వాళ్లకు ఆ దమ్ము, ధైర్యం లేవని నేను అనుకుంటున్నాను,” అని నాగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన అభిప్రాయాన్ని బలంగా చెప్పారు. ‘శివ’ సినిమా కేవలం నాగార్జున కోసమే తీశానని అన్నారు. “ఆ పాత్రలో నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోలేను,” అని వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ వేరే దర్శకుడు తీసినా, ఆ పాత్రకు నాగార్జున మాత్రమే సరిపోతారని అన్నారు. అంతేకాకుండా, ప్రత్యేకంగా చైతన్య, అఖిల్ గురించి అడిగినప్పుడు కూడా, “నేను తీయను. శివ కేవలం నాగార్జునది మాత్రమే,” అని ఆర్జీవీ తేల్చి చెప్పారు.

ఆ తర్వాత, భవిష్యత్తు ప్రణాళికల గురించి వర్మ మాట్లాడారు. తాను ఒక మంచి హిట్ కొట్టిన తర్వాతే, మరో సినిమా కోసం నాగార్జున వద్దకు వెళ్తానని వర్మ అన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున తన తండ్రి, దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకున్నారు. ‘శివ’ విడుదలైనప్పుడు ఆయన స్పందనను పంచుకున్నారు.

“సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కామెడీ లేదు, అది లేదు ఇది లేదు అన్నారు,” అని నాగ్ చెప్పారు. “ఆ సమయంలో నాన్నతో కలిసి పంజాగుట్ట దగ్గర కారులో వెళ్తున్నాను. అప్పుడు ఆయన ‘సినిమా పెద్ద హిట్టు రా’ అన్నారు. ‘చాలా బాగా చేశావ్.. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో కూడా ఊహించలేను’ అని ఆయన చెప్పారు,” అని నాగార్జున ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

నాగార్జున తన పాత చిత్రాల గురించి కూడా నిజాయితీగా మాట్లాడారు. ‘గీతాంజలి’, ‘శివ’ సినిమాలకు ముందు తన పాత చిత్రాలు తనకు నచ్చేవి కావని ఒప్పుకున్నారు. ఆ సినిమాల్లో తాను వేసుకున్న బట్టలు కూడా నచ్చేవి కావని అన్నారు. ‘శివ’ తెలుగు పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తున్న వేళ, ఈ క్లాసిక్‌ను అక్కినేని వారసులు కూడా టచ్ చేయలేరని సృష్టికర్తలే స్పష్టం చేశారు.

Leave a comment