‘కాంత’కు కొత్త కష్టం.. రిలీజ్ డైలమాలో దుల్కర్, రానా!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘కాంత’. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకుడు.

ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ఇప్పటికే తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.అయితే, ఈ సినిమా విడుదలకు ఇప్పుడు ఒక కొత్త అడ్డంకి ఏర్పడింది.

ఈ చిత్రం దివంగత తమిళ నటుడు ఎం. కె. త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కిందని ఆయన మనవడు బి. త్యాగరాజన్ ఆరోపిస్తున్నారు.ఈ మేరకు ఆయన చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే తన తాత బయోపిక్ తీశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై కోర్టు స్పందించింది. నవంబర్ 18వ తేదీలోపు దీనిపై సమాధానం ఇవ్వాలని ‘కాంత’ చిత్ర యూనిట్‌ను ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలపై డైలమా నెలకొంది. నవంబర్ 14న రిలీజ్ పెట్టుకోగా, 18లోపు సమాధానం చెప్పాలని కోర్టు చెప్పడం గమనార్హం.దీంతో అభిమానులు సినిమా వాయిదా పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ సినిమా పాక్షికంగా మాత్రమే ఎం. కె. టి జీవితం నుండి ప్రేరణ పొందిందని దుల్కర్ సల్మాన్ చెప్పినట్లు సమాచారం. కథలో చాలా భాగం కల్పితమని తెలిసింది.

ఈ సినిమా కథ ఒక గురువు (సముద్రఖని), అతని శిష్యుడైన నటుడికి (దుల్కర్) మధ్య జరిగే అహానికి సంబంధించినదిగా ప్రచారం జరుగుతోంది.ఏదేమైనా, ఈ తాజా వివాదం రానా, దుల్కర్‌లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.

కోర్టు నోటీసుల నేపథ్యంలో ‘కాంత’ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వివాదం నుండి బయటపడి, సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a comment