బెట్టింగ్ యాప్స్ స్కామ్: రానాని గంటపాటు ప్రశ్నించిన సీఐడీ!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కుంభకోణం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణను సీఐడీ ఆధ్వర్యంలోని సిట్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, నటుడు రానా దగ్గుబాటి శనివారం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

అధికారులు రానాని దాదాపు గంటకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడానికి చేసుకున్న ఒప్పందాలు ఏమిటి? చెల్లింపులు ఎలా జరిగాయి? వంటి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, ఈ ప్రమోషన్లకు ముందు యాప్స్ చట్టబద్ధతను పరిశీలించారా అని కూడా ప్రశ్నించారు.

అయితే, తాను నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ యాప్‌తోనూ ఒప్పందం చేసుకోలేదని రానా అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ప్రమోషన్‌కు ముందే తన లీగల్ టీమ్ ఆయా ఏజెన్సీల వివరాలను పూర్తిగా పరిశీలించిందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఆయన సిట్ అధికారులకు సమర్పించినట్లు సమాచారం.

ఈ కేసులో రానా మాత్రమే కాకుండా, పలువురు ఇతర ప్రముఖులు కూడా నోటీసులు అందుకున్నారు. ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్‌లను కూడా సిట్ అధికారులు వేర్వేరు రోజుల్లో విచారించారు. యాంకర్ విష్ణు ప్రియ, మరికొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు కూడా ఈ కేసులో వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం 2017 గేమింగ్ చట్టం ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధించింది. ఈ యాప్స్ కారణంగా ఎంతో మంది యువత మోసపోయి, ఆర్ధికంగా చితికిపోతున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో, ఈ యాప్‌ల నిర్వాహకులు మరియు వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై సీఐడీ దృష్టి సారించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తోంది.

Leave a comment