“వాడు చేసింది యదవ పని”: ఐబొమ్మ రవి తండ్రి సంచలన వ్యాఖ్యలు!

ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి పైరసీ సైట్లతో కోట్లు గడించిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఫ్రాన్స్, కరేబియన్ దీవుల నుండి ఆపరేట్ చేస్తున్న రవి, తన భార్యతో విడాకుల గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చి పోలీసులకు చిక్కాడు. అంతకుముందు, “నన్ను పట్టుకోండి చూద్దాం” అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు.

ఈ మొత్తం ఘటనపై రవి తండ్రి అప్పారావు (విశాఖపట్నం వాసి) తీవ్రంగా స్పందించారు. “వాడు చేసింది యదవ పని. పోలీసులకే సవాల్ విసరడం పెద్ద తప్పు,” అంటూ ఆయన మండిపడ్డారు. తన కొడుకు చేస్తున్న చట్టవిరుద్ధమైన పనుల గురించి తమకు ఏమీ తెలియదని ఆయన అన్నారు.

కొడుకు ఇక్కడ కోట్లు సంపాదిస్తున్నా, తమ కుటుంబం మాత్రం అప్పులతో సతమతం అవుతోందని అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. “నా కొడుకు వల్ల మాకు చాలా కుటుంబ సమస్యలు వచ్చాయి. అతని వివాహ జీవితం కూడా నాశనం అయింది,” అని ఆయన అన్నారు.

రవి తన భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇమ్మడి రవిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి, కస్టడీకి కోరనున్నారు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ ద్వారా రవి సుమారు 12 కోట్ల రూపాయల వరకు సంపాదించి ఉండవచ్చని, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా ఈ ఆదాయం పొందాడని సమాచారం.

Leave a comment