ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం టాలీవుడ్లో పెద్ద బ్రేకింగ్ న్యూస్. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు లాంటి పెద్దలందరూ హమ్మయ్య అన్నారు. సీపీ సజ్జనార్ గారిని కలిసి థాంక్స్ చెప్పారు. మా కష్టాన్ని దొంగిలిస్తున్న దొంగ దొరికాడని ఆనందపడ్డారు.
అంతా బాగానే ఉంది. పైరసీ చెయ్యడం ఖచ్చితంగా నేరమే. కానీ, ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు’ అన్నట్టు, ఇండస్ట్రీ లోపలే ఉంటూ ప్రేక్షకులను దోచుకుంటున్న వారి సంగతేంటి? ఈ థియేటర్ దోపిడీ గురించి ఎవరు మాట్లాడతారు?
పండగలకు, పెద్ద హీరోల సినిమా రిలీజ్‌లకు ‘బెనిఫిట్ షో’ల పేరుతో ఒక దారుణమైన దోపిడీ మొదలవుతుంది. ప్రభుత్వాల దగ్గర పర్మిషన్లు తెచ్చుకుని, టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తారు. ఇది ఎవరి బెనిఫిట్ కోసం? హీరోల అభిమానాన్ని అడ్డం పెట్టుకుని జనాల జేబులకు చిల్లు పెట్టడం దోపిడీ కాదా?
ఇక మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాతిక రూపాయల వాటర్ బాటిల్‌ను రెండు వందలకు, ముప్పై రూపాయల కూల్ డ్రింక్‌ను మూడు వందలకు అమ్ముతారు. ఒక పాప్‌కార్న్ కాంబో ధర 400 దాటుతుంది. కొన్నిసార్లు టికెట్ రేటు కన్నా ఈ తిండి ఖర్చే ఎక్కువ.
బయటి నుండి కనీసం మంచి నీళ్ల బాటిల్ కూడా తీసుకువెళ్లనివ్వరు. లోపల ఆకాశాన్నంటే ధరలకు అమ్ముతారు. కొన్ని వస్తువులపై స్పెషల్ ఎమ్మార్పీలు వేసి మరీ అమ్ముతారు. నిలదీస్తే దబాయిస్తారు. ఈ దోపిడీలో నిర్మాతలకు, థియేటర్ యాజమాన్యాలకు అందరికీ వాటా ఉంటుంది.
ఒక ఫ్యామిలీ సినిమాకు వెళితే.. “ఈజీగా వెయ్యి రూపాయల వరకు” అవుతుందని కూడా అంటున్నారు. నెల జీతంలో సగం సినిమాకే పెడితే, సామాన్యుడు బతికేది ఎలా? అందుకే, ఈ ఖర్చు భరించలేకే చాలామంది ఓటీటీ కోసం ఆగుతున్నారు, లేదా ఐబొమ్మ లాంటి పైరసీ సైట్ల వైపు చూస్తున్నారు.
పరిష్కారం కేవలం ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం కాదు. ‘చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు’… అసలు సమస్యను పక్కనపెట్టి పైరసీ గురించి మాత్రమే ఏడవడం ఆపాలి. ముందుగా ఈ థియేటర్ దోపిడీని ఆపాలి. టికెట్ రేట్లు, ముఖ్యంగా క్యాంటీన్ ధరలు అందుబాటులోకి తేవాలి. అప్పుడే ప్రేక్షకుడు సంతోషంగా థియేటర్‌కు వస్తాడు.

