మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కీలక నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు వారి ఆర్థిక మూలాలపైనే నేరుగా దెబ్బ కొట్టింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మాజీ ఎమ్మెల్యేకు నిజంగా పెద్ద షాక్. ఈ బహుళ కోట్ల స్కామ్‌లో ఆయన 38వ నిందితుడిగా (A38) ఉన్నారు.
జప్తు చేయదగిన ఆస్తుల విలువ రూ.63.72 కోట్లుగా తేలింది. వీటిలో భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ పేర్ల మీద ఉన్న ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. గత వైసీపీ పాలనలో అందిన కమీషన్లు, కిక్‌బ్యాక్‌ల ద్వారానే చెవిరెడ్డి కుటుంబం ఈ ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఆర్థిక అక్రమాలే. ఈ ఆస్తుల మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ పత్రాలలో కేవలం రూ.8.85 కోట్లు మాత్రమే చూపించారు. మిగిలిన రూ.54.87 కోట్లు లెక్కల్లో చూపని నగదు రూపంలో చెల్లించినట్లు సిట్ గుర్తించింది. అంటే, ఇది పూర్తిగా నల్లధనాన్ని భూములు, రియల్ ఎస్టేట్‌గా మార్చిన వ్యవహారంగా తేలింది. .
మరోవైపు, అక్రమంగా సంపాదించిన ఈ డబ్బును రాజకీయ అవసరాలకు మళ్లించినట్లు సిట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మద్యం స్కాం ద్వారా వచ్చిన సొమ్మును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వినియోగించినట్లు అనుమానిస్తున్నారు.
దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో జూన్ 2025లో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి మాత్రం, ఈ కేసు కేవలం టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనను రాజకీయంగా వేధించేందుకే పెట్టిందని ఖండించారు. అయినప్పటికీ, విజయవాడలోని స్పెషల్ ఏసీబీ కోర్టు ద్వారా చట్టపరమైన ఆస్తుల జప్తు ప్రక్రియను కొనసాగించాలని డీజీపీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ హై-ప్రొఫైల్ కేసులో చర్య తప్పదని స్పష్టమైంది.

