జీ20లో మోదీ ‘మాస్టర్ స్ట్రోక్’.. ప్రపంచ దేశాలకు ఆ మూడు ఆఫర్లు ఇవే!

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పక్కా సొల్యూషన్స్‌తో ముందుకు రావడం మోదీ స్టైల్. తాజాగా ఈ సదస్సులో ‘సమగ్ర, సుస్థిర ఆర్థిక వృద్ధి’ అనే అంశంపై మాట్లాడుతూ.. మోదీ మూడు సంచలన ప్రతిపాదనలు చేశారు. ఇవి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.

మొదటి బాణం: ఆరోగ్య సైన్యం కరోనా కష్టకాలం ప్రపంచానికి ఏం నేర్పిందో మనందరికీ తెలుసు. అందుకే, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య విపత్తు వచ్చినా, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా.. తక్షణమే స్పందించేలా ఒక ‘గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’ను ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. ఇది ఒక రకంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం లాంటిదన్నమాట.. కాకపోతే వీళ్ళు తుపాకులు కాకుండా స్టెతస్కోప్‌లు పట్టుకొస్తారు! జీ20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్య నిపుణులు ఇందులో ఉంటారు.

రెండవది: మన విద్య.. ప్రపంచానికి వైద్యం భారతీయ సనాతన ధర్మం, ఆయుర్వేదం, యోగా వంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే విషయాన్ని మోదీ మరోసారి హైలైట్ చేశారు. సంప్రదాయ విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ‘జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ’ని ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మన వంటింటి చిట్కాల నుంచి వేద విజ్ఞానం వరకు అంతా డిజిటలైజ్ చేసి ప్రపంచ ఆరోగ్యానికి వాడుకుందాం అనేది దీని సారాంశం.

మూడవది: డ్రగ్స్-టెర్రర్ లింక్ కట్! ఉగ్రవాదానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతోంది? డ్రగ్స్ మాఫియా నుంచే కదా! ఈ పాయింట్‌ను మోదీ గట్టిగా పట్టుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం.. ఈ రెండింటి లింక్ తెంచేయడానికి ప్రత్యేక జీ20 చొరవ కావాలని డిమాండ్ చేశారు. “డ్రగ్స్-టెర్రర్ ఎకానమీని బలహీనపరుద్దాం” అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

ఆఫ్రికాకు అదిరిపోయే గిఫ్ట్.. ఇక, ఆఫ్రికా గడ్డపై నిల్చుని ఆఫ్రికన్లకు మోదీ ఇచ్చిన ఆఫర్ మామూలుగా లేదు. ‘జీ20 ఆఫ్రికా స్కిల్స్‌ మల్టిప్లయర్ ఇనీషియేటివ్’ పేరుతో రాబోయే పదేళ్ళలో 10 లక్షల మంది ట్రైనర్లను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అంటే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పిస్తామన్నట్టు.. ఆఫ్రికా యువతకు స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి “నేను ఉన్నాను” అంటూ గ్లోబల్ లీడర్‌గా మోదీ తన మార్క్ చూపించారు.

Leave a comment