“సంపాదన కోసం సముద్రాలు దాటారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో అర్ధాంతరంగా రాలిపోతున్నారు.” ప్రస్తుతం అమెరికా, కెనడా, యూఏఈ వంటి దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల (NRIs) పరిస్థితి ఇది. గత మూడు నెలల్లోనే మన తెలుగు వారితో సహా అనేకమంది యువకులు గుండెపోటుతో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వారే మృత్యువాత పడుతుండటం గమనార్హం.
వరుస విషాదాలు: ఇటీవల కాలంలో చోటుచేసుకున్న మరణాలు ఎన్నారై కమ్యూనిటీని షాక్‌కు గురిచేస్తున్నాయి.
- సాయి కృష్ణ రామచందర్ రాజు అల్లూరి (30): వర్జీనియాలో సాయంత్రం వాకింగ్‌కు వెళ్లి, అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
- ప్రతీక్ పాండే (35): సిలికాన్ వ్యాలీలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసులో పని ఒత్తిడితో ప్రాణాలు వదిలారు.
- హరిరాజ్ సుదేవన్ (37): యూఏఈలో తన భార్య, బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో దింపి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో మరణించారు.
- వీరితో పాటు కార్తిక్ అరిసెట్టి (36), రమణ్‌దీప్ సింగ్ గిల్ (40), అభయ్ పట్నాలా (33) వంటి వారు కూడా గుండెపోటుకు బలయ్యారు.
అసలు కారణాలేంటి? “కార్యం మీదనే ధ్యాస.. కాయం మీద నిర్లక్ష్యం” అన్నట్లుగా మారింది ఎన్నారైల జీవనశైలి. విపరీతమైన పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దానికి తోడు, కోవిడ్-19 తర్వాత యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరిగాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ట్రంప్ కొత్త రూల్స్.. గోరుచుట్టుపై రోకటి పోటు: ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఎన్నారైల గుండెల్లో మరింత గుబులు రేపుతున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి వీసాలు నిరాకరించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అమెరికా ప్రభుత్వంపై భారం కాకూడదన్నది దీని ఉద్దేశం. ఇది అమలైతే చాలా మంది కలలు కల్లలయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి, డాలర్ల వేటలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. తరచూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది.

