నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ పై మహా శివరాత్రి దండయాత్ర!

‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన నిఖిల్ సిద్దార్థ్, ఆ తర్వాత కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ‘స్పై’, మొన్నొచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో నిఖిల్ గ్రాఫ్ కాస్త డల్ అయ్యింది. తన బలమైన జోనర్ అయిన పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌నే మళ్ళీ నమ్ముకున్నాడు మన యంగ్ హీరో. ఈసారి ఎలాగైనా సరే గట్టి హిట్టు కొట్టాలన్న కసితో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’.

చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఎట్టకేలకు ఒక సాలిడ్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరి 13న, మహా శివరాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం రిలీజ్ డేట్ పోస్టర్ వదిలి చేతులు దులుపుకోకుండా, ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ పేరుతో ఒక మేకింగ్ వీడియోను కూడా వదిలారు. ఇందులో నిఖిల్ కత్తి సాము, గుర్రపు స్వారీ చూస్తుంటే.. కచ్చితంగా ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం టెక్నీషియన్స్. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండటంతో విజువల్స్ పీక్స్ లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ వంటి విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. మొత్తానికి 170 రోజుల షూటింగ్ తర్వాత గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక ప్రమోషన్ల జాతర మొదలుకానుంది. చూద్దాం, ఈ ‘స్వయంభు’ నిఖిల్ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెడతాడో లేదో!

Leave a comment