“అన్నింటికీ ఒకటే మందు” అన్నట్టుగా, ఏపీలో సకల సంక్షేమ పథకాలకు ఇక ఒకే ఒక్క కార్డు రాబోతోంది. గతంలో రేషన్ కార్డు కోసం ఒక యుద్ధం, కుల ధ్రువీకరణ కోసం మరో యుద్ధం చేయాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ తిప్పలు ఉండవని కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అవును, మీరు విన్నది నిజమే! ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి ‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్’ జారీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ పథకం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటంటే.. ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’. అంటే రాష్ట్రాన్ని కాకుండా, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని సంక్షేమ ఫలాలు అందిస్తారన్నమాట. సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో బాబు గారు అధికారులకు డెడ్ లైన్ కూడా పెట్టేశారు. వచ్చే ఏడాది (2026) జనవరి నాటికి డేటా సేకరణ పూర్తి చేసి, జూన్ కల్లా జనాల చేతిలో ఈ స్మార్ట్ కార్డులు పెట్టాల్సిందేనట.
ఈ కార్డులో ఏముంటాయంటే? ఈ కార్డు చూడటానికి సింపుల్ గా ఉన్నా, ఇందులో ఉండే చిప్ మాత్రం పవర్ ఫుల్. క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేస్తే చాలు.. మీ జాతకం మొత్తం (అదేనండి.. ప్రభుత్వ డేటా) ప్రత్యక్షమవుతుంది.
- ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ పత్రాలు.
- టీకాలు (Vaccination), న్యూట్రిషన్ వివరాలు.
- విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్.
- వృద్ధుల పెన్షన్లు, ఇతర పథకాల అర్హతలు. మొత్తం 25 రకాల కీలక వివరాలు ఈ ఒక్క కార్డులోనే నిక్షిప్తం చేస్తారట. అంతేకాదు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘P4’ (పీపుల్-పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్) పేదరిక నిర్మూలన సమాచారం కూడా ఇందులో ఉంటుంది.
టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు రూటే సెపరేటు కదా! రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) డేటా లేక్ ద్వారా లబ్ధిదారులను పక్కాగా గుర్తించడం, డూప్లికేట్లను ఏరివేయడమే దీని లక్ష్యం. అర్హులైన వారికి మేలు జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది?

