ఏపీ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ఆధ్యాత్మిక ధామంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సుమారు రూ.260 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.
రెండు దశల్లో నిర్మాణం – మినీ తిరుమలగా ముస్తాబు:
ఈ ఆలయ విస్తరణ పనులు రెండు దశల్లో జరగనున్నాయి.
-
మొదటి దశ (రూ.140 కోట్లు): ఇందులో ప్రధానంగా రెండో ప్రాకారం నిర్మాణం, ఏడు అంతస్తుల మహా రాజగోపురం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం మరియు ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి పనులు చేపడతారు.
-
రెండో దశ (రూ.120 కోట్లు): తిరుమల తరహాలో ఆలయం చుట్టూ మాడ వీధులు, అన్నదాన సత్రం, యాత్రికుల వసతి గృహాలు, అర్చకుల క్వార్టర్లు, వేద పాఠశాల వంటివి నిర్మిస్తారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిని “భూలోక వైకుంఠం”లా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. 2019లోనే ఈ ఆలయానికి బీజం పడినా, గత ప్రభుత్వం (వైసీపీ) హయాంలో పనులు నత్తనడకన సాగాయని, ప్రాజెక్టును నీరుగార్చారని పరోక్షంగా చురకలు అంటించారు.
“దేవుడి సొమ్ముతో ఆటలాడితే వెంకన్నే చూసుకుంటాడు,” అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే రెండున్నరేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.మొత్తానికి అమరావతిలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే, విజయవాడ-గుంటూరు వాసులకు ‘మినీ తిరుమల’ అందుబాటులోకి వచ్చినట్లే.

