విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఏపీ ఫైబర్‌నెట్ (AP Fibernet) కేసును కోర్టు అధికారికంగా కొట్టివేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఆర్థిక అవకతవకలు జరగలేదని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లలేదని సీఐడీ (CID) సమర్పించిన తుది నివేదికను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
అసలు ఏం జరిగింది?
2014-19 మధ్యకాలంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో దాదాపు రూ. 321 కోట్ల అవినీతి జరిగిందంటూ గత జగన్ ప్రభుత్వం ఆరోపించింది. టెర్రాసాఫ్ట్ (Tera Software) అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని, ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని అప్పట్లో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే, తాజా దర్యాప్తులో ఆ ఆరోపణలకు సరైన ఆధారాలు లభించలేదు.
ఫిర్యాదుదారుడి యూ-టర్న్!
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అప్పట్లో ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న ఫైబర్‌నెట్ మాజీ ఎండీ మధుసూదన రెడ్డి కూడా ఇప్పుడు ప్లేట్ తిప్పేశారు. “అక్రమాలు జరగలేదన్న సీఐడీ రిపోర్ట్‌తో నేను ఏకీభవిస్తున్నాను, కేసు మూసివేసినా అభ్యంతరం లేదు” అని ఆయన రాతపూర్వకంగా కోర్టుకు తెలిపారు. ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దీంతో, సాక్ష్యాధారాలు లేకపోవడం మరియు ఫిర్యాదుదారులే వెనక్కి తగ్గడంతో ఏసీబీ కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది. మొత్తానికి ఫైబర్ నెట్ కేసు కొట్టేయడం సిఎం చంద్రబాబు కి పెద్ద ఊరట.

