నిద్ర కూడా కరువే.. సినిమా కష్టాల చిట్టా విప్పిన కీర్తి సురేష్!

ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో “వర్కింగ్ అవర్స్” (పని గంటలు) పై పెద్ద చర్చే నడుస్తోంది. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, తల్లి అయ్యాక రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని కండిషన్ పెట్టారని, అందుకే ప్రభాస్ ‘స్పిరిట్’, ‘కల్కి-2’ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నారని పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలోనే మహానటి కీర్తి సురేష్ ఈ అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో తన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తి, నటీనటులు, టెక్నీషియన్లు పడుతున్న ఇబ్బందులను పూసగుచ్చినట్లు వివరించారు. బయట నుంచి చూసేవాళ్ళకి సినిమా లైఫ్ గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ, లోపల పరిస్థితి వేరని ఆమె కుండబద్దలు కొట్టారు.

“నేను ఎలాంటి షిఫ్ట్ అయినా చేస్తా.. మహానటి టైమ్‌లో ఒకే రోజు మూడు సినిమాల షూటింగ్స్ చేశా. కానీ అందరూ అలా ఉండలేరు కదా?” అంటూ కీర్తి ఆసక్తికరమైన లెక్క ఒకటి చెప్పారు.

“మనం 9 నుంచి 6 గంటల వరకే షూటింగ్ అనుకున్నా.. ఉదయం 9 గంటలకు మేకప్ వేసుకొని రెడీగా ఉండాలి. అంటే 7:30 కల్లా సెట్‌లో ఉండాలి. ఇందుకోసం తెల్లవారుజామున 5:30 కల్లా నిద్ర లేవాలి. సాయంత్రం 6:30కి ప్యాకప్ చెప్పినా.. మేకప్ తీసి, ఇంటికెళ్లి, జిమ్ చేసి, డిన్నర్ ముగించేసరికి రాత్రి 11 దాటుతుంది. అంటే రోజుకు కనీసం 6 గంటల నిద్ర కూడా ఉండదు. ఇది ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించండి,” అని కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

నటీనటుల కంటే ముందే సెట్‌కు వచ్చి, అందరూ వెళ్ళాక వెళ్లే లైట్‌బాయ్స్, అసిస్టెంట్ల కష్టాల గురించి కీర్తి ప్రస్తావించడం విశేషం. మాలీవుడ్ (మలయాళం), బాలీవుడ్ ఇండస్ట్రీల్లో ఇప్పటికీ 12 గంటల షిఫ్టులు నడుస్తున్నాయని, అక్కడ లైట్‌మెన్లకు రోజుకు 3-4 గంటల నిద్ర దొరకడమే గగనమని ఆమె తెలిపారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో పరిస్థితి కాస్త మెరుగ్గా (9-6 షిఫ్ట్) ఉందని చెప్పుకొచ్చారు.

మొత్తానికి, ‘నిద్ర కూడా ఆహారం లాంటిదే.. అది లేకపోతే మనిషి పనిచేయలేడు’ అంటూ దీపికా లేవనెత్తిన పాయింట్‌కు కీర్తి తనదైన శైలిలో మద్దతు పలికినట్లయింది.

Leave a comment