నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన టీజర్, అంచనాలను ఆకాశానికి చేర్చేసింది.
బోయపాటి శ్రీను మార్క్ మాస్, పవర్ ఫుల్ యాక్షన్, దానికి తోడు బాలయ్య బాబు నట విశ్వరూపం.. ఇవన్నీ కలిపి ఈ టీజర్‌ను ఒక పూనకం తెచ్చేలా చేశాయి.
గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం. ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అఖండ’ ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే.
ఇప్పుడు సీక్వెల్ కూడా అదే స్థాయిలో కాకుండా, దానికి రెండింతలు ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు ‘తాండవం’ టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ‘అఖండ 2’ కథ ఈసారి మరింత పెద్ద కాన్వాస్‌పై ఆధ్యాత్మికత, ఆవేశం, యాక్షన్‌తో నిండి ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా విడుదలైన ఈ టీజర్లో బాలయ్య చెప్పిన డైలాగులు, ఆయన లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అఘోరా గెటప్‌లో ఆయన ఎంట్రీ, చేసే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్‌కు పండగలా అనిపించాయి.
బాలయ్య మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌లను బోయపాటి కట్ చేసిన తీరు సూపర్‌గా ఉంది. ఆయన టేకింగ్ ఈసారి మరింత గ్రాండ్‌గా, విజువల్స్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. బాలయ్య, బోయపాటిల కెమిస్ట్రీ అస్సలు తగ్గలేదని నిరూపితమైంది.
ఇక ఈ సినిమాకు ప్రాణం పోసింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ S. ‘అఖండ’కు ఎంత పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఇచ్చాడో, ఈ ‘తాండవం’ టీజర్‌కు కూడా అంతకుమించి ఇచ్చాడు. “ధమ్ ధమ్ ధమ్” అంటూ తమన్ కొట్టిన బీట్‌కు థియేటర్లలో ప్రేక్షకులు సీట్ల నుంచి లేవడం ఖాయం. ఆడియో పరంగా ఈ సినిమా మరో హిట్‌గా నిలవడం పక్కా.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా యువ నటి సంయుక్త మీనన్ నటిస్తుండగా, విలన్‌గా ఆది పినిశెట్టి పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కూడా కీలకపాత్రలో టాలీవుడ్‌కు పరిచయం అవుతుండడం విశేషం.
నిజానికి, ఈ సినిమా రిలీజ్ మొదట్లో సెప్టెంబర్ 25 అని ప్రచారం జరిగింది. కానీ, నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు సినిమాను డిసెంబర్ 5, 2025 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా 3D, IMAX వంటి అత్యాధునిక ఫార్మాట్లలో రిలీజ్ కానుండడం హైలైట్. ఈ కొత్త టీజర్ చూసిన తర్వాత డిసెంబర్ 5 కోసం బాలయ్య ఫ్యాన్స్ మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

