స్మృతి మంధాన పెళ్లి రద్దు వార్తలకు చెక్: ఒక్క ఎమోజీతో క్లారిటీ!

టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ల వివాహం ఎట్టకేలకు ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట పెళ్లి వాయిదా పడడం కంటే, అసలు పెళ్లే రద్దైపోయిందనే గుసగుసలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి.

అయితే, అన్ని రూమర్లకు చెక్ పెడుతూ.. ఈ సెలబ్రిటీ జోడీ తమ స్టైల్‌లో సింగిల్ ఎమోజీతో అసలు క్లారిటీ ఇచ్చేసింది. ఆ ఒక్క ‘దిష్టి రక్ష’ ఎమోజీ కథేంటో, పెళ్లి ఎందుకు వాయిదా పడిందో చూద్దాం!

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23, 2025న స్మృతి సొంతూరు సాంగ్లిలో చాలా గ్రాండ్‌గా జరగాల్సి ఉంది. హల్దీ, మెహందీ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు సైతం ఘనంగా పూర్తయ్యాయి. బరాత్ బయలుదేరడానికి కొన్ని గంటల ముందు ఊహించని పరిణామం జరిగింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి ముందు ఇటువంటి షాక్ తగలడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు.

అయితే, ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. మామ శ్రీనివాస్ అంటే పలాష్ ముచ్చల్‌కు ఎంతో అభిమానమట. స్మృతి కంటే కూడా ఆయనకే ఎక్కువ అటాచ్‌మెంట్ ఉందని తెలుస్తోంది. మామ అనారోగ్యంతో బాధపడుతుండగా పెళ్లి చేసుకోనని పలాశ్ గట్టిగా చెప్పేశారట. దీంతో స్మృతి నిర్ణయం కంటే ముందే పలాశ్ పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, పలాశ్ కూడా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. మొత్తానికి పెళ్లి ఇంట్లో మొదలైన ఈ ‘టెన్షన్’ వాయిదాకు కారణమైంది.

పెళ్లి వాయిదా పడిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ఈ సమయంలో స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలాశ్‌తో ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన పోస్టులు, వీడియోలు (ముఖ్యంగా జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంకలు షేర్ చేసిన వీడియోలు) ఒక్కసారిగా డిలీట్ చేసేశారు. ఇంకేముందీ! సోషల్ మీడియా డిటెక్టివ్‌లకు ఇదే మెయిన్ పాయింట్‌గా దొరికింది.

‘పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేశాడు’, ‘వేరే అమ్మాయితో చాటింగ్ చేశాడు’ అంటూ కొన్ని అన్‌వెరిఫైడ్ స్క్రీన్ షాట్లు నెట్టింట దర్శనమిచ్చాయి. పెళ్లి కాన్సిల్ అయ్యిందని, స్మృతి కోపంతోనే పోస్టులు డిలీట్ చేసిందని కొందరు, పలాశ్ మోసం చేసి పెళ్లిని చెడగొట్టాడని మరికొందరు కథలు అల్లడం మొదలుపెట్టారు. మంధాన స్నేహితులు కూడా ఆ వీడియోలను తొలగించడం, పుకార్లకు మరింత బలం చేకూర్చింది.

పుకార్లు హద్దులు మీరిపోతున్న తరుణంలో, పలాశ్ తల్లి అమిత ముచ్చల్ రంగంలోకి దిగారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “స్మృతి, పలాశ్ ఇద్దరూ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నారు (మానసిక ఒత్తిడిలో ఉన్నారు). నా కొడుకు కోడలిని ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు, నేను కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాను. అంతా బాగానే ఉంది, పెళ్లి చాలా త్వరగా జరుగుతుంది” అని తేల్చి చెప్పారు.

పలాశ్ తల్లి స్టేట్‌మెంట్ రూమర్లకు కొంచెం బ్రేక్ వేసినా, సోషల్ మీడియా జనం మాత్రం ఇంకా రచ్చ ఆపలేదు. అందుకే, పలాశ్, స్మృతి మంధాన సైలెంట్‌గా తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని బయో సెక్షన్‌లో ‘Evil Eye’ (దిష్టి రక్ష) ఎమోజీని యాడ్ చేశారు.

పుకార్లతో, అబద్ధపు వార్తలతో తమ బంధానికి దిష్టి తగిలిందన్న ఉద్దేశంతోనే ఈ జంట ఈ సింబల్‌ను ఉపయోగించినట్లు అర్థమవుతోంది. ఒక్కమాట మాట్లాడకుండానే, తమ బంధం పదిలం అని, బయట వస్తున్నవన్నీ పుకార్లే అని ఈ ‘దిష్టి రక్ష’ ఎమోజీతో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Leave a comment