ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ‘దిష్టి’ బొమ్మగా మారిపోయింది. కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కామెంట్స్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జనకంపల్లి అనిరుధ్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.జడ్చర్ల నియోజకవర్గం నుంచి గెలిచిన అనిరుధ్ రెడ్డి, పవన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తెలంగాణ ప్రజలంటే మీకు అంత చిన్న చూపా?” అని నేరుగా ప్రశ్నించారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగలడం ఏమిటని నిలదీశారు.
హైదరాబాద్ ఆస్తులు అమ్మేయండి… ఆంధ్రాకు వెళ్లండి!
పవన్ కళ్యాణ్ నిజాయితీని, చిత్తశుద్ధిని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. “ఆంధ్రప్రదేశ్ మీద మీకు అంత ప్రేమ, శ్రద్ధ ఉంటే.. హైదరాబాద్‌లో ఎందుకు ఉంటున్నారు?” అని ఘాటు సెటైర్ వేశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నట్లు ప్రచారం జరుగుతోందని, నిజంగా ఏపీపై ప్రేమ ఉంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకొని విజయవాడ వెళ్లిపోవాలని, అక్కడి నుంచే ఏపీ ప్రజలకు సేవ చేయాలని సవాల్ విసిరారు.
చిరంజీవి లేకపోతే ఎవ్వడు దేకడు!
రాజకీయ విమర్శల విషయంలో అనిరుధ్ రెడ్డి మరింత వ్యక్తిగతంగా వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేయాలని సవాల్ విసిరారు. “చిరంజీవి లేకపోతే నిన్ను ఎవ్వడు దేకడు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.బీఆర్ఎస్ కూడా అదే రూట్లో…పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే స్పందించడంతో ఈ వివాదం మరో స్థాయికి చేరింది.
వాస్తవానికి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సైతం ఇదే తరహాలో మండిపడ్డారు. దిష్టి తగిలితే కోనసీమలో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని సెటైర్ వేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతూ, ఇక్కడి ప్రజలపై దిష్టి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని అనిరుధ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల్లో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, అటు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఇటు తెలంగాణపై వ్యక్తిగత దాడికి దిగితే… ఫలితం ఇలా ఘాటు కౌంటర్లతోనే ఉంటుందని అనిరుధ్ రెడ్డి చూపించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, జనసేన ఎలా స్పందిస్తారో చూడాలి.

