తెలుగు సినీ పరిశ్రమలో ‘నట కిరీటి’గా ఎంతో గౌరవం, ఆప్యాయత సంపాదించుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నాలుక జారి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఈసారి ఆయన వ్యాఖ్యల లక్ష్యం మాములు వ్యక్తి కాదు, పద్మశ్రీ బ్రహ్మానందం.
ఇటీవల జరిగిన ‘సహకుటుంబం’ అనే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ అవాంఛనీయ సంఘటన చోటుచేసుకుంది. ముందుగా బ్రహ్మానందం స్టేజీపై మాట్లాడగా, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేందుకు వచ్చారు.
ఆ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్.. “పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత.. నేను ఏమి మాట్లాడగలను?” అని సరదాగా అన్నారు. దానికి వెంటనే స్పందించిన బ్రహ్మానందం, “మేము ఎంత ఎదిగినా నీ శిష్యులమే కదా” అని గౌరవంగా బదులిచ్చారు.
సమస్యంతా ఇక్కడే మొదలైంది. బ్రహ్మానందం ఇచ్చిన గౌరవానికి రాజేంద్ర ప్రసాద్ బదులిస్తూ, ఏమాత్రం సభా మర్యాద లేకుండా, “ఎంతైనా ముసలి ముం**కొడుకువి కదా” అనే పదాన్ని వాడారు. ఈ మాట వినగానే పక్కనే ఉన్న బ్రహ్మానందం ఆశ్చర్యపోయి, “ఎవరు నేనా?” అని అడిగారు. వెంటనే తేరుకున్న రాజేంద్ర ప్రసాద్, “కాదు, నేను” అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఐతే, ఇద్దరూ అగ్ర నటులు, మంచి స్నేహితులైనప్పటికీ, పదుల సంఖ్యలో కెమెరాలు, వేల మంది అభిమానులు ఉన్న ఒక బహిరంగ వేదికపై, బ్రహ్మానందం వంటి గౌరవనీయ వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి దుర్భాష వాడటం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఒకసారి పొరపాటు జరిగింది అంటే క్షమించవచ్చు. కానీ, రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి ఈ మధ్యకాలంలో ఇదే విధంగా కొనసాగుతోంది.
కొద్ది నెలల క్రితం ‘రాబిన్‌హుడ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి కూడా ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అవమానకరంగా కనిపించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. అంతకుముందు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో నటుడు అలీని ఉద్దేశించి కూడా ఇలాంటి అసభ్యకర పదాన్నే వాడి, ఆ మరుసటి రోజు మళ్ళీ క్షమాపణ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది.
క్షమాపణలు చెప్తున్నప్పటికీ, ప్రతి ఈవెంట్లోనూ ఇలాంటి ‘నాలుక జారే’ సంఘటనలు పునరావృతం కావడం ఆయన ఇమేజ్‌కు, దశాబ్దాల సినీ ప్రయాణంలో సంపాదించుకున్న గౌరవానికి తీవ్రంగా భంగం కలిగిస్తోందని విమర్శకులు అంటున్నారు. వయస్సు, అనుభవం పెరిగేకొద్దీ పెద్దరికం, మాటతీరులో పరిణితి ఉండాలి కానీ, ఇలా బహిరంగంగా తోటి నటులపై నోరు జారడం ‘నట కిరీటి’కి ఏమాత్రం తగని విషయం.
ఈ వరుస వివాదాల నేపథ్యంలో, రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగాలపై, ముఖ్యంగా బహిరంగ వేదికలపై, మరింత జాగ్రత్త వహించాలని అభిమానులు, సినీ పెద్దలు కోరుతున్నారు. లేదంటే, ఆయన పాత సినిమాల హాస్యంతో పాటు, ఈ కొత్త వివాదాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రమాదం ఉంది.

