కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు “టిఫిన్ సెంటర్” చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉప్పు-నిప్పులా ఉన్న సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇప్పుడు “బ్రేక్ఫాస్ట్ డిప్లమసీ” (Breakfast Diplomacy) పేరిట భాయి-భాయి అంటున్నారు.
తాజాగా డీకే శివకుమార్ నివాసంలో జరిగిన విందు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, నాటుకోడి ఘుమఘుమలు ఉన్నా.. అసలు చర్చ మాత్రం “ముఖ్యమంత్రి కుర్చీ” చుట్టూనే నడిచింది.
సిద్దు స్వరం మారింది.. డీకేకు గ్రీన్ సిగ్నల్?
ఇంతకాలం “నేనే ఐదేళ్లు సీఎంగా ఉంటా” అని బల్లగుద్ది చెప్పిన సిద్దరామయ్య, సడన్ గా రూటు మార్చారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “హైకమాండ్ ఎప్పుడు చెబితే అప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతారు” అని వ్యాఖ్యానించడం కన్నడ నాట సంచలనంగా మారింది. అంటే, హైకమాండ్ ఆదేశిస్తే తాను దిగిపోవడానికి రెడీ అని సిద్దు పరోక్షంగా సిగ్నల్ ఇచ్చినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తయ్యాయి (నవంబర్ 20 నాటికి). తెరవెనుక ఉన్న ఒప్పందం ప్రకారం.. మొదటి 2.5 ఏళ్లు సిద్దరామయ్య, తర్వాతి 2.5 ఏళ్లు డీకే శివకుమార్ సీఎం పీఠం ఎక్కాలి.
ఇన్నాళ్లు ఈ ఒప్పందాన్ని దాచిపెట్టిన నేతలు, ఇప్పుడు బహిరంగంగానే దీని గురించి చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే బెళగావి అసెంబ్లీ సెషన్ లో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవాలంటే పార్టీలో ఐక్యత అవసరం. అందుకే ఈ “దోశ-చికెన్” రాయబారాలు అని టాక్.
రికార్డుల కోసమే వేచి చూస్తున్నారా?
అయితే సిద్దరామయ్య అంత తేలిగ్గా కుర్చీ దిగుతారా? అంటే అనుమానమే. రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు, ఎక్కువ కాలం సీఎంగా ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్న తర్వాతే ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ మాత్రం.. “రాష్ట్రంలో బ్రేక్ఫాస్ట్ మంత్రిత్వ శాఖ మాత్రమే పనిచేస్తోంది, పాలన పడకేసింది” అని సెటైర్లు వేస్తున్నాయి.
మొత్తానికి ఇడ్లీ సాంబార్ తో మొదలైన ఈ స్నేహం.. కుర్చీ మార్పు వరకూ వెళ్తుందా లేక కేవలం హైకమాండ్ ను మభ్యపెట్టడానికేనా అనేది డిసెంబర్ 8న మొదలయ్యే అసెంబ్లీ సెషన్ లో తేలిపోతుంది.

