భారతీయ సినిమాను టెక్నాలజీతో మరో స్థాయికి తీసుకెళ్ళిన దిగ్గజ దర్శకుడు శంకర్, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ‘ఇండియన్ 2’, మరియు ఇటీవల వచ్చిన ‘గేమ్ చేంజర్’ ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, శంకర్ బ్రాండ్ పై చిన్న మచ్చ పడింది.
అయితే, ఓటమిని అంగీకరించని ఈ క్రియేటివ్ జీనియస్, ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ (Velpari) తో ఏకంగా 1000 కోట్ల భారీ సాహసానికి సిద్ధమవుతున్నారు.
కథేంటి? నవల నేపథ్యం ఏంటి?
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎంపీ వెంకటేశన్ రాసిన ప్రసిద్ధ తమిళ నవల ‘వీరయుగ నాయగన్ వేల్పారి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ కథ సంగం కాలం నాటి గిరిజన రాజు ‘వేల్ పారి’ చుట్టూ తిరుగుతుంది.
మూవేందర్లుగా పిలవబడే చేర, చోళ, పాండ్య రాజుల ఉమ్మడి సైన్యాన్ని ఒంటిచేత్తో ఎదిరించిన పారి పరాక్రమం ఈ నవల సారాంశం. శంకర్ ఈ అద్భుతమైన కథను మూడు భాగాలుగా (Trilogy) తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
సూర్య, విక్రమ్ ఎంట్రీ..?
ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టైటిల్ రోల్ కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అలాగే, శంకర్ ఆస్థాన నటుడు చియాన్ విక్రమ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. వీరితో పాటు బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 2026లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.
అవతార్, గేమ్ ఆఫ్ త్రోన్స్ రేంజ్?
ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ శంకర్, “‘రోబో’ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నా, కానీ ‘వేల్పారి’ దాన్ని మించిన కల. ఇది మన భారతీయ ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ లేదా ‘అవతార్’ అవుతుంది” అని స్టేట్మెంట్ ఇచ్చారు.
గ్రాఫిక్స్ మాయాజాలంతో పాటు, బలమైన ఎమోషన్ కూడా ఉంటేనే ఈ 1000 కోట్ల ప్రయోగం వర్కౌట్ అవుతుంది. లేదంటే నిర్మాతల జేబులకు చిల్లులే!
వరుస దెబ్బలతో కసిగా ఉన్న శంకర్, ఈ పీరియాడిక్ వార్ డ్రామాతో తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటారో లేదో చూడాలి.

