టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజుల హోరాహోరీ పోరు. కానీ కోల్‌కతాలో సీన్ రివర్స్ అయింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ మూడో రోజు టీ విరామానికే ముగిసింది. తొలిరోజు 11, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయంటే పిచ్ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పిచ్‌పై సర్వత్రా విమర్శలు వస్తుండగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ‘సొంత వాయిద్యం’ వాయించారు.
“పిచ్‌లో ఎలాంటి దెయ్యాలు (demons) లేవు. మేం ఎలాంటి పిచ్ అడిగామో, క్యూరేటర్ సుజన్ ముఖర్జీ అదే ఇచ్చారు. బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. తలదించుకుని, పట్టుదలగా ఆడితే పరుగులు చేయగల వికెట్ ఇది” అంటూ గంభీర్ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. తమకు కావాల్సిన పిచ్ ఇదేనని ఆయన గట్టిగా సమర్ధించుకున్నారు.
గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “గంభీర్ మాటలు నాకు గందరగోళంగా ఉన్నాయి. జట్టు యాజమాన్యం ఇలాంటి పిచ్ అడిగిందంటే నమ్మలేకపోతున్నా. నేను అండర్-19 ఆడినప్పటి నుండి ఈడెన్‌లో ఆడుతున్నా, కానీ మూడు రోజుల్లో ఇలా ప్రవర్తించే పిచ్‌ను ఎప్పుడూ చూడలేదు” అని కుంబ్లే అన్నారు.
సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఇంకా ఘాటుగా స్పందించాడు. “పిచ్‌లో దెయ్యాలు లేవని ఆయన (గంభీర్) అన్నారా? నాకైతే చాలా కనిపించాయి. కొన్ని బంతులు కీపర్ భుజం పైనుంచి వెళ్తుంటే, మరికొన్ని బంతులు పాదాలకు తగులుతున్నాయి. ఇది బ్యాటింగ్‌కు చాలా కఠినమైన వికెట్. ఇక్కడ బ్యాటర్లకు అసలు అవకాశమే లేదు” అని స్టెయిన్ కుండబద్దలు కొట్టారు.
మరోవైపు, అశ్విన్ కూడా పిచ్ తయారీలో లోపం జరిగిందని, అందుకే బంతి అనూహ్యంగా బౌన్స్ అయిందని అభిప్రాయపడ్డారు. మొత్తంమీద, గంభీర్ వ్యాఖ్యలు “పుండు మీద కారం చల్లినట్లు” ఉండటంతో ఈ వివాదం మరింత ముదిరింది.

