కవి అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రజా కవి అందెశ్రీ ఆకస్మిక మరణంతో రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ సృష్టికర్త అయిన అందెశ్రీ (64) సోమవారం (నవంబర్ 10) గుండెపోటుతో కన్నుమూశారు.

ఆయన హఠాన్మరణం సాహితీ, రాజకీయ రంగాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మంగళవారం జరిగిన అందెశ్రీ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హారజయ్యారు. ఈ సందర్భంగా సీఎం చేసిన ఒక పని అందరినీ కదిలించింది. ఆయన కేవలం నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా అందెశ్రీ పాడెను భుజాన మోశారు.

ఒక ముఖ్యమంత్రి ఇంత సామాన్యంగా, వినమ్రంగా వ్యవహరించడం కవికి ఇచ్చిన గొప్ప గౌరవంగా ప్రజలు భావిస్తున్నారు.

అంతకుముందు, రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిగారి భార్యను, ఇతర బంధువులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజా కవి సేవలకు గుర్తింపుగా, ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

అందె ఎల్లయ్యగా జన్మించిన అందెశ్రీ, ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి ‘ప్రజా కవి’గా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు, ముఖ్యంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతం, కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రంలోని కళాకారుల పట్ల, సాంస్కృతిక దిగ్గజాల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న గౌరవానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు.

Leave a comment