చండీగఢ్‌ మాదే.. కేంద్రం ‘ఆర్టికల్ 240’ స్కెచ్‌పై భగ్గుమన్న పంజాబ్!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు చండీగఢ్ హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజధాని వివాదాన్ని కేంద్రం ఒక్కసారిగా రాజేసింది. చండీగఢ్ పరిపాలనను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేసిన “ఆర్టికల్ 240” స్కెచ్ ఇప్పుడు పంజాబ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. “మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు”.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న పంజాబ్‌కు ఇది మరో తలనొప్పిగా మారింది.

అసలేం జరిగింది? పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చండీగఢ్‌ను ‘ఆర్టికల్ 240’ పరిధిలోకి తేవాలని కేంద్రం యోచించింది. ఇదే జరిగితే, ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ చేతిలో ఉన్న చండీగఢ్ పాలనా పగ్గాలు, నేరుగా కేంద్రం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి వెళ్తాయి. అంటే అండమాన్, లక్షద్వీప్ తరహాలో చండీగఢ్ కూడా పూర్తిగా కేంద్రం కనుసన్నల్లోకి వెళ్లిపోతుందన్నమాట.

భగ్గుమన్న పంజాబ్! ఈ వార్త తెలియగానే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. “చండీగఢ్ పంజాబ్ ఆత్మ.. మా రాజధానిని లాక్కోవడానికి కేంద్రం కుట్ర చేస్తోంది” అంటూ మండిపడ్డారు. అటు విపక్ష కాంగ్రెస్, అకాలీదళ్ కూడా రాజకీయాలకు అతీతంగా గొంతు కలిపాయి. “మా ఊరు, మా పేరు లాగేసుకుంటారా?” అంటూ అరవింద్ కేజ్రీవాల్ సైతం కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.

దిగొచ్చిన కేంద్రం.. కానీ? పంజాబ్ నుంచి వచ్చిన ఈ ఊహించని వ్యతిరేకతతో కేంద్ర హోం శాఖ కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం అలాంటి తుది నిర్ణయమేదీ తీసుకోలేదని, బిల్లు ఇప్పుడే పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చింది. కేవలం పాలనా సౌలభ్యం కోసమే ఈ ఆలోచన చేశామని సర్దిచెప్పుకుంది. మొత్తానికి “అంతేలే.. అధికారంలో ఉన్నోడికి అలుసు ఎక్కువ” అన్నట్లుగా కేంద్రం తీరు ఉందంటూ పంజాబ్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చండీగఢ్ మాత్రం ఎప్పటిలాగే పంజాబ్, హర్యానాల మధ్య నలిగిపోతూనే ఉంది.

Leave a comment