జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో హైడ్రా ఎఫెక్ట్: బీఆర్‌ఎస్ అంధుకున్న పదునైన అస్త్రం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని, హైదరాబాద్‌పై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రా ఆపరేషన్‌ను ప్రధాన ఆయుధంగా మలచుకుంది.హైడ్రా అస్త్రంతో కేటీఆర్ చెలరేగిపోతున్నారు. వాటిలో ముఖ్యంగా..

  • ధనికులకు మినహాయింపు: 15 మంది పెద్ద బిల్డర్ల నిర్మాణాల్లో తప్పులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కా స్వయంగా అంగీకరించినప్పటికీ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు.
  • కుటుంబ రక్షణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) పరిధిలో ఉన్నా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాణంపైనా చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
  • ఓల్డ్ సిటీ మినహాయింపు: పాతబస్తీలో ఓవైసీ కుటుంబానికి చెందిన కట్టడాలు చెరువుల్లో ఉన్నా, అవి హైడ్రా పరిధికి రాలేదని, దీనిపై ఎంఐఎం-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కేటీఆర్ విమర్శించారు.

కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గందరగోళంలో పడిందని, పెట్టుబడిదారులు వెనుకడుగు వేస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బలవంతులను ఆదరిస్తూ, బలహీనులను అణచివేసే ఈ విధానం 64 రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ నాయకులు ఈ సందేశాన్ని ఓటర్లకు బలంగా చేరవేయడానికి సమావేశాల్లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు ఉపయోగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను కేవలం స్థానిక పోటీగా కాకుండా, హైడ్రాకు, ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మార్చేందుకు బీఆర్‌ఎస్ వ్యూహం పన్నింది.

“బుల్డోజర్ పాలన కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, ఆ పాలనను ఆపాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని” కేటీఆర్ ఓటర్లను గట్టిగా కోరుతున్నారు. ఈ హైడ్రా ఆపరేషన్ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో నవంబర్ 11న తేలాల్సి ఉంది.

Leave a comment