నెల్లూరు మేయర్ కుర్చీకి ఎసరు? స్రవంతిపై టీడీపీ ‘అవిశ్వాస’ వేటు!

నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారం మారినప్పటి నుంచి నెల్లూరు కార్పొరేషన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ‘అధికారం ఉంటేనే అందలం.. లేదంటే అంతే సంగతులు’ అన్నట్లుగా, నిన్నటి దాకా వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి మేయర్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

40 మంది కార్పొరేటర్ల తిరుగుబాటు! నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 56 డివిజన్లు ఉండగా, గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌తో సహా 29 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా 40 మంది కార్పొరేటర్లు ఏకతాటిపైకి వచ్చి మంత్రి పొంగూరు నారాయణను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ తీరుపై కార్పొరేటర్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. మేయర్ దంపతులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.

సోమవారమే ముహూర్తం? “చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి గుడిసెలు” అన్నట్లుగా మేయర్ వ్యవహారశైలి ఉందని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. నెల్లూరు అభివృద్ధి జరగాలంటే కొత్త మేయర్ రావాల్సిందేనని వారు మంత్రి నారాయణకు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా కార్పొరేటర్ల వాదనతో ఏకీభవించినట్లు సమాచారం. దీంతో అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లందరూ సంతకాలు చేశారని, సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అధికారికి ఈ నోటీసు అందించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతికంగా ప్రస్తుతం మేయర్ పీఠం వైసీపీదే అయినా, సంఖ్యాబలం మొత్తం టీడీపీ వైపు ఉండటంతో స్రవంతి పదవి గండం దాటడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి సింహపురిలో వైసీపీకి మిగిలిన ఆ ఒక్కటి (మేయర్ పీఠం) కూడా చేజారిపోయేలా కనిపిస్తోంది. మరి మేయర్ స్రవంతి ఈ గండాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Leave a comment