ప్రపంచం మనదే! నేపాల్‌పై ఘన విజయం.. టీమిండియా అమ్మాయిల సరికొత్త చరిత్ర!

కొలంబో (శ్రీలంక): భారత క్రికెట్‌కు ఇది స్వర్ణయుగం అని చెప్పక తప్పదు! ఇప్పటికే పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, ఇప్పుడు మన మహిళా మణుల వంతు వచ్చింది. చూపు లేకపోతేనేం.. మా చూపు లక్ష్యం పైనే అంటూ టీమిండియా మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శ్రీలంక వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక మొట్టమొదటి మహిళల బ్లైండ్ T20 వరల్డ్ కప్ 2025 టైటిల్‌ను భారత్ ఎగరేసుకుపోయింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ సమరంలో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి, విశ్వవిజేతగా నిలిచింది.

మ్యాచ్ హైలైట్స్ ఇవే: టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మన బౌలర్ల దెబ్బకు నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో నేపాల్ 5 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. కేవలం 12.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజేతగా అవతరించింది.

స్టార్ ప్లేయర్ పూల సరెన్: ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ పూల సరెన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 27 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. నేపాల్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలతో విరుచుకుపడింది.

అజేయంగా.. అద్భుతంగా: ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు మన అమ్మాయిలదే ఆధిపత్యం. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి జట్లను మట్టికరిపించి ఫైనల్ చేరారు. అంధుల క్రికెట్ అంటే ఆషామాషీ కాదు.. బంతిలోని గలగల శబ్దాన్ని బట్టి అంచనా వేస్తూ ఆడాలి. అలాంటి క్లిష్టమైన ఆటలో మన అమ్మాయిలు చూపిన తెగువకు దేశం మొత్తం సలాం కొడుతోంది.

నిజంగా, “కళ్లు లేకపోయినా కలలు కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు” అని ఈ విజయంతో మన జట్టు నిరూపించింది. శభాష్ టీమిండియా!

Leave a comment