ప్రభాస్ విడుదల చేసిన దుల్కర్ ‘కాంత’ ట్రైలర్ : గురు-శిష్యుల ఘర్షణ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా, మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంత’ చిత్రం యొక్క తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1950ల నాటి సినీ పరిశ్రమ నేపథ్యంలో రూపొందింది. ఈ పీరియడ్ డ్రామా ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.

‘కాంత’ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ యొక్క వేఫేరర్ ఫిల్మ్స్ మరియు రానా దగ్గుబాటి యొక్క స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని వంటి ప్రముఖ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రం 1950ల నాటి మద్రాస్ (నేటి చెన్నై) నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ తమిళ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ కథను రాసినట్లు సమాచారం. ఈ కథకు సంగీతం,ఆర్ట్ వర్క్ కాంత కు నిండుదనం చేకూర్చినట్టు కనపడుతోంది.

ట్రైలర్ ప్రకారం, కథ గురువు, శిష్యుడి మధ్య ఉండే అహంకారంతో కూడిన ఘర్షణ చుట్టూ తిరుగుతుంది. సముద్రఖని పోషించిన దర్శకుడు/గురువు పాత్రకు, దుల్కర్ సల్మాన్ పోషించిన నటుడు టి.కె. మహాదేవన్ కు మధ్య విభేదాలు ఏర్పడతాయి. “ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి నిన్ను పాడు చేసేసాయి” వంటి సంభాషణలు ఈ వైరుధ్యాన్ని స్పష్టం చేశాయి.నటుడిగా, నిర్మాతగా రానా దగ్గుబాటి ఈ చిత్రంలో నటించారు. ట్రైలర్‌లో ఆయన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఈ ఘర్షణలో ఆయన జోక్యం చేసుకోవడం వల్ల కథలో ఉత్కంఠ పెరుగుతుంది. ట్రైలర్‌లోని “ఊదేయడానికి నేను మట్టిని కాదు, పర్వతాన్ని” అనే డైలాగ్ మాస్‌గా ఆకట్టుకుంది.

‘కాంత’ చిత్రం నవంబర్ 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియడ్ డ్రామా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Leave a comment