తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో శనివారం సాయంత్రం ఓ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరు వేదికగా కలుసుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఇద్దరు అగ్రనేతలు ఇలా బాహటంగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఈ వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేవలం హాజరవ్వడమే కాదు, పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. వేదికపై విజేతలకు అవార్డులు అందించే సమయంలోనూ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకోవడం కనిపించింది. “ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి” అన్న సామెతలా.. మొన్నటి వరకు అధికారంలో వెలిగిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ, ప్రభుత్వాల నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు.
అటు కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, ఇటు జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు కూటమి ప్రభుత్వం నుండి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బహుశా ఈ “కామన్ కష్టాలు” వీరిని మానసికంగా దగ్గర చేశాయేమోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువు కావడంతో.. భవిష్యత్తులో వీరి స్నేహం ఇంకేమైనా కొత్త మలుపులు తిరుగుతుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తానికి, బెంగళూరు చలిలో వీరిద్దరి భేటీ తెలుగు రాజకీయాల్లో మాత్రం సెగ పుట్టించింది.

