మద్యపానం నిషేధం – తక్కువ ధరకే నాణ్యమైన మద్యం – లిక్కర్ స్కామ్ – బెల్టు షాపులు – నకీలీ మద్యం✨
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీ విజయం తర్వాత మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేసింది.నవరత్నాలలో మద్యపానం నిషేధం కూడా ఒక కీలక హామీ అవ్వడం వలన జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది.ఆ వేగంలో తప్పటడుగులు కూడా పడటం వలన 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం అమలుపరిచిన మద్యం పాలసీ మీద ఉన్న వ్యతిరేకత కూడా ఓట్ల రూపంలో తీవ్ర ప్రభావం చూపింది.
అదేవిధంగా 2024 లో ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం కూడా మద్యం విషయంలో తీవ్ర ఆరోపణలు,వ్యతిరేకతలు,విమర్శలు ఎదుర్కుంటోంది.
వివరంగా చెప్పాలంటే ..
వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటిదాకా ప్రయివేటు పరంగా ఉన్న మద్యం షాపులను ప్రభుత్వ పరంగా నడిపించడం,ధరలు పెంచడం,జనాలకు తెలియని బ్రాండ్ లను తీసుకురావడం,క్వాలిటీ విషయంలో విమర్శలు,డిజిటల్ చెల్లింపులు అనుమతించకపోవడం వంటి చర్యల వలన మద్యపాన ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడాల్సి వచ్చింది.వైస్సార్సీపీ ఏదో చెయ్యాలని అనుకుంటే అది ఇంకోదో అయ్యి జనం చేత మొట్టికాయలు వేయించుకోవడం జరిగిపోయింది.
ఇక టీడీపీ పార్టీ విషయానికి వస్తే 2024 కు ముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు ఆశ్చర్యకరంగా “తక్కువ ధరకే నాణ్యమైన మద్యం” స్లోగన్ తో ఎలక్షన్స్ కి వెళ్ళింది.వైస్సార్సీపీ హయాంలో మద్యం పాలసీ జనాల మీద ఎంత నెగటివ్ ప్రభావం చూపిందో టీడీపీ స్లోగన్ వచ్చిన స్పందన చూస్తే అర్ధం అవుతుంది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అధీనంలోని మద్యం షాపులని నిలిపివేసి ప్రయివేటు వ్యక్తుల పరం చేసింది.ఇక్కడ నుంచే చంద్రబాబు ప్రభుత్వం కూడా తప్పటడుగులు వెయ్యడం మొదలయ్యింది.టెండర్ లో దాదాపు మొత్తం మద్యం షాపులను టీడీపీ నాయకుల ఆధీనంలోనే ఉండేలా చూసుకోవడడం వలన అధికారం అండతో గ్రామాల్లోకి బెల్టు షాపులు ఏర్పాటు చేసి ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా జరగడం మొదలయ్యింది.
ఈ బెల్టు షాపులు గ్రామ టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా గ్రామంలో ఉండే వ్యక్తుల నుంచి లక్ష నుండి 2 లక్ష రూపాయల వరకు మద్యం షాపుల యజమానులకు డిపాజిట్ చేయించి మద్యం తమ గ్రామాల్లోని బెల్టు షాపులకు సరఫరా చేయిస్తున్నారు.ఇలా దాదాపు ప్రతీ గ్రామంలో 2,3 బెల్టు షాపుల ఏర్పాటు ద్వారా ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.ఇవన్నీ ఎమ్మెల్యే లు,ప్రభుత్వ అధికారుల అండతోనే జరుగుతున్నాయి అనేది బహిరంగ రహస్యం.
బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ విషయం తెలుసో లేదో..? తెలియదు అనుకోవడం కూడా అవివేకమే.బహుశా అయన దానిని టీడీపీ కార్యకర్తల సంక్షేమం అనుకోని ఉండవచ్చు.
ఇలాగే బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు నియంత్రించకపోతే ఇప్పటికిప్పుడు తీవ్ర వ్యతిరేకత కనపడకపోయినా అది నివురు కప్పిన నిప్పులా టీడీపీ ప్రభుత్వాన్ని కూడా దహించి వేయక మానదు.అంతే కాకుండా ఇటీవల బయటపడిన నకీలీ మద్యం తయారీ వ్యవహారం కూడా టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
వైస్సార్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మిథున్ రెడ్డి,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టులు అవ్వడం, ఈ టీడీపీ ప్రభుత్వం హయాంలోనే నకిలీ మద్యం తయారీలో రెండు పార్టీల నాయకులకు సంబంధాలు ఉన్నాయని కథనాలు రావడం లాంటివి రాష్ట్రానికి అన్నివిధాలుగా విచారకరం.ప్రమాదకరం..!
ఇది ఇలాగే కొనసాగితే…
జనం అప్పుడు నాణ్యమైన మద్యం ఇవ్వలేదు అని నెపంతో వైస్సార్సీపీ ప్రభుత్వం ఓటమికి ముఖ్య కారణం అయ్యారో..అదే జనం ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా బెల్టు షాపులు – నకీలీ మద్యమే అని విశ్వసిస్తే వైస్సార్సీపీ కి జరిగిన నష్టమే టీడీపీ కి జరుగుతుంది.

