ఎప్పుడెప్పుడా అని డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మాటలకంటే సౌండ్ ఎక్కువగా ఉండే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఆదివారం (నవంబర్ 23) హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
మెగాస్టార్ ఆశీస్సులతో.. ఈ ఓపెనింగ్ సెర్మనీకి ఇండస్ట్రీ పెద్ద దిక్కు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమాను ప్రారంభించారు. చిరు తన చేతుల మీదుగా క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘యానిమల్’ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందీప్ వంగా, ఈసారి ప్రభాస్ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
హీరోయిన్ ఫిక్స్.. కానీ డార్లింగ్ ఎక్కడ? ఈ కార్యక్రమంలో బాలీవుడ్ భామ తృప్తి డిమ్రి సందడి చేసింది. ఆమె ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించనుంది. అయితే, పూజా కార్యక్రమ ఫోటోల్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, చిరంజీవి, హీరోయిన్ కనిపించారు కానీ.. మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం కనిపించలేదు. బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారా లేక లుక్ రివీల్ కాకూడదని దాచారా అనేది తెలియాల్సి ఉంది. ‘రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే ప్రభాస్ రాలేకపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కథేంటంటే.. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. “నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది” అంటూ ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మొత్తానికి ‘స్పిరిట్’ పట్టాలెక్కింది. ఇక సందీప్ వంగా మార్క్ ‘వయొలెన్స్’ ఎలా ఉంటుందో చూడాలంటే 2026 వరకు ఆగాల్సిందే!

