బాలయ్యపై వ్యాఖ్యలు.. హిందూపురంలో వైసీపీ ఆఫీస్ ధ్వంసం!

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఇన్‌చార్జ్ దీపిక భర్త వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లేపాక్షిలో జరిగిన ఓ సమావేశంలో వేణు రెడ్డి మాట్లాడుతూ, “గత 40 ఏళ్లుగా హిందూపురం ప్రజలు బానిస బతుకులు బతుకుతున్నారు. ఎవరో హైదరాబాద్‌లో కూర్చుంటే, ఇక్కడి ప్రజలు ఆయన కింద బతకాలా?” అంటూ బాలకృష్ణను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

అనంతరం, శనివారం (నవంబర్ 15) సాయంత్రం వందలాది మంది టీడీపీ కార్యకర్తలు హిందూపురంలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వారు ఒక్కసారిగా ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, ఫర్నీచర్, టీవీలు, ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా, ఆఫీస్ ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఈ దాడి ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. టీడీపీ శ్రేణులు, బాలకృష్ణ అనుచరులు ఈ అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

మరోవైపు, వైసీపీ ఇన్‌చార్జ్ దీపిక ఈ దాడిని ఖండించారు. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి అని ఆరోపిస్తూ, తమ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ ఘటనతో హిందూపురం పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Leave a comment