ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘X’ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి సంబంధించిన ‘కాగ్’ నివేదికలోని గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవ గణాంకాలకు పొంతన లేదని జగన్ విమర్శించారు. “తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం” అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విఫలమైందని ఆయన ఆరోపించారు.
ఇంకా, కాగ్ నివేదిక ప్రకారం.. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% గా మాత్రమే నమోదైందని జగన్ ఎత్తి చూపారు. మరోవైపు, ప్రభుత్వం 2024-25లో 12.02%, 2025-26లో 17.1% GSDP వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని గుర్తుచేశారు.
అయితే, వాస్తవ ఫలితాలు దారుణంగా ఉన్నాయని కాగ్ నివేదికలే చెబుతున్నాయని అన్నారు. ఆదాయాలు పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు.
“సంపద సృష్టి లేకపోవడంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది,” అని జగన్ వ్యాఖ్యానించారు. ఇంత తక్కువ వృద్ధి రేటుతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ప్రభుత్వం ఎలా ప్రచారం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

