కాంత : మూవీ రివ్యూ

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్, గాయత్రి, నిళగల్ రవి తదితరులు

దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్

నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్

సినిమాటోగ్రఫీ: డానీ సాంచేజ్ లోపేజ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్

మ్యూజిక్: జాను చాంతర్

ఎడిటింగ్: లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్

బ్యానర్: స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్

దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి వంటి భారీ తారాగణంతో ‘కాంత’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. 1950ల నాటి సినిమా పరిశ్రమ నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించారు.కొంచెం థ్రిల్లర్ మోడ్ లో కూడా కనపడుతున్న ఈ కాంత ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ ఏంటి?

1950ల కాలంలో, ‘అయ్య’ (సముద్రఖని) ఒక పేరుపొందిన దర్శకుడు. తన శిష్యుడైన మహాదేవన్ (దుల్కర్ సల్మాన్) ను హీరోగా పరిచయం చేస్తాడు. అనతికాలంలోనే మహాదేవన్ పెద్ద సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు. అయితే, గురుశిష్యుల మధ్య ఇగో క్లాష్ మొదలవుతుంది. దీనివల్ల వారు చేస్తున్న ‘శాంత’ అనే సినిమా మధ్యలోనే ఆగిపోతుంది.

కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక నిర్మాత వారిద్దరినీ మళ్లీ కలిపి ఆ సినిమాను ‘కాంత’ పేరుతో పూర్తి చేయడానికి ఒప్పిస్తాడు. ఈ ప్రాజెక్టులోకి కొత్త హీరోయిన్ కుమారి (భాగ్యశ్రీ బోర్సే) వస్తుంది. అప్పటికే పెళ్లయిన మహాదేవన్, కుమారితో ప్రేమలో పడతాడు. ఈ ఇగోల గొడవ, ప్రేమకథ నడుస్తున్న సమయంలోనే, సెట్‌లో ఒక హత్య జరుగుతుంది. ఆ కేసును విచారించడానికి పోలీస్ ఆఫీసర్ ఫినిక్స్ (రానా దగ్గుబాటి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ హత్య చేసింది ఎవరు? సినిమా పూర్తయిందా? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఒక బలమైన పీరియాడ్ డ్రామా కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. సినిమా మేకింగ్, ఇగో క్లాష్ వంటి అంశాలతో ఫస్టాఫ్ ఆసక్తికరంగానే మొదలవుతుంది. దుల్కర్ మరియు సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయి. అయితే, సినిమా అసలు సమస్య సెకండాఫ్‌లో మొదలవుతుంది.

గొప్ప పీరియాడ్ డ్రామాగా సాగుతున్న కథ, ఒక్కసారిగా మర్డర్ మిస్టరీగా టర్న్ తీసుకోవడం పెద్ద మైనస్. ఆ తర్వాత వచ్చే అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకుడిలో తీవ్ర గందరగోళం సృష్టిస్తాయి.ఈ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ చాలా నెమ్మదిగా, బోర్ కొట్టించేలా సాగుతుంది. ఆ తర్వాత వచ్చే అనవసరమైన సన్నివేశాలు ప్రేక్షకుడిలో తీవ్ర గందరగోళం సృష్టిస్తాయి.

రానా దగ్గుబాటి ఎంట్రీ మొదట ఆసక్తి పెంచినా, ఆయన పాత్ర సినిమా టోన్‌కి అస్సలు సింక్  అవ్వలేదు. వింటేజ్ వాతావరణంలో రానా పాత్ర చాలా లౌడ్‌గా, మోడ్రన్‌గా అనిపించి, ప్రేక్షకుడిని సినిమా నుండి బయటకు లాగేస్తుంది.

సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన అంశం.. ‘సినిమాలో సినిమా’ చూపించే ప్రయత్నం. ఈ ‘సినిమాలో సినిమా’ కూడా దాదాపు 80% ఒకే ఇండోర్ సెట్‌లో చిత్రీకరించడం పెద్ద తలనొప్పి. ఈ ఆర్టిస్టిక్ టచ్ సినిమా పరిశ్రమ వాళ్లకు “ఆహా ఓహో” అనిపించవచ్చేమో గానీ, టికెట్ కొని వచ్చిన సామాన్య ప్రేక్షకుడికి మాత్రం ఇది చాలా భారంగా, విసుగు తెప్పించేలా అనిపిస్తుంది.

అసలు ఒక హత్య చేయడానికి దారితీసిన కారణం ఏమాత్రం బలంగా (కన్విన్సింగ్‌గా) లేదు. ఎప్పుడైతే హత్యకు కారణమే బలహీనంగా ఉందో, ఇక దాని చుట్టూ అల్లిన ఇన్వెస్టిగేషన్ ఘట్టం (అది కూడా సెకండాఫ్ మొత్తం) ప్రేక్షకుడిని సినిమా నుంచి పూర్తిగా డిస్‌కనెక్ట్ చేస్తుంది.

నిజానికి ప్రీ-క్లైమాక్స్‌లో గురుశిష్యులు (దుల్కర్, సముద్రఖని) ఇద్దరూ తమ ఇగోలను పక్కనపెట్టి మాట్లాడుకునే సన్నివేశం సినిమాకు ఎమోషనల్ పీక్‌గా నిలవాలి. కానీ, అప్పటికే రెండు గంటల నెమ్మదైన కథనంతో విసిగిపోయిన ప్రేక్షకుడు, ఆ సీన్‌కు కనెక్ట్ అయ్యే పరిస్థితిలో ఉండడు.

నటన విషయానికి వస్తే ఈ సినిమాకు అతిపెద్ద బలం దుల్కర్ సల్మాన్. మహాదేవన్ పాత్రలో ఆయన జీవించారు. ఒక సూపర్ స్టార్ ఇగో, ప్రేమ, ఆవేదనను అద్భుతంగా పలికించారు. ఇది ఖచ్చితంగా ఆయన కెరీర్‌లో ఒక ‘వన్ మ్యాన్ షో’గా నిలుస్తుంది.

దర్శకుడి పాత్రలో సముద్రఖని కూడా అంతే బలంగా నటించారు. దుల్కర్‌కు దీటుగా, హుందాగా తన పాత్రను పోషించారు. కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సే అందంగా కనిపించడమే కాకుండా, కళ్లతోనే అభినయిస్తూ ఆకట్టుకుంది. రానా దగ్గుబాటి తన పాత్రకు న్యాయం చేసినా, ఆ పాత్రే సినిమాకు మైనస్‌గా మారింది.

సాంకేతిక వర్గం :

సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ టెక్నికల్ అంశాలు. డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ను ఒక పెయింటింగ్‌లా చూపించారు. 1950ల కాలాన్ని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా పునఃసృష్టించింది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం (BGM) చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. కానీ, జాను చంతర్ అందించిన పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోవు.

“నువ్వు నాకు అవకాశం మాత్రమే ఇచ్చావు. జీవితాన్ని కాదు’’ వంటి డైలాగులు పేలాయి.

ఫైనల్ గా..!

మొత్తంగా, ‘కాంత’ ఒక ఆర్టిస్టిక్ సినిమా. దుల్కర్ సల్మాన్ విశ్వరూప నటన, అద్భుతమైన విజువల్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. కానీ, చాలా నెమ్మదిగా సాగే కథనం, పూర్తిగా బెడిసికొట్టిన సెకండాఫ్, అనవసరమైన మర్డర్ మిస్టరీ ట్రాక్ సినిమాను దెబ్బతీశాయి. ఇది అందరు ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా కాదు, కేవలం పీరియాడ్ డ్రామాలను ఇష్టపడే వారికే నచ్చుతుంది.

SkyC Rating : 2.5/5

Leave a comment