గోవా వేదికగా జరుగుతున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI 2025)లో టాలీవుడ్ ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా సత్కరించింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ చేతుల మీదుగా బాలయ్య ఈ సత్కారాన్ని అందుకున్నారు. అయితే, సన్మానం కంటే.. ఆ తర్వాత మైక్ అందుకున్న బాలయ్య చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో ‘హాట్ టాపిక్’గా మారాయి.
సాధారణంగా బాలయ్య బాబు ఎక్కడ ఉన్నా తనదైన ముక్కుసూటితనంతో మాట్లాడటం మనకు తెలిసిందే. గోవా గడ్డపై కూడా అదే తీరును ప్రదర్శించారు. “నాన్నగారు ఎన్టీఆర్ గారి వారసత్వమే కాదు.. సినిమాపై నాకున్న పట్టు కూడా నన్ను 50 ఏళ్లుగా నడిపిస్తోంది” అని చెబుతూనే, ప్రస్తుత కాలం నాటి మేకింగ్ స్టైల్ పై సెటైర్లు వేశారు.
“ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ మాయాజాలం నడుస్తోంది. హీరోలు సెట్స్ కు రావడం లేదు.. కేవలం గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ల ముందే షూటింగ్ కానిచ్చేస్తున్నారు. కానీ నేను అలా కాదు.. ఐ యామ్ ఒరిజినల్. నేను డూప్లికేట్ కాదు. కథ డిమాండ్ చేస్తేనే గ్రాఫిక్స్ వాడాలి కానీ, ప్రతీదానికి కాదు” అంటూ బాలయ్య తనదైన శైలిలో పంచ్ డైలాగులు పేల్చారు.
ఈ వేడుకలో బాలయ్యతో పాటు ఆయన సతీమణి వసుంధర గారు కూడా పాల్గొన్నారు. తన తల్లి జ్ఞాపకార్థం కట్టించిన క్యాన్సర్ ఆసుపత్రి గురించి, సమాజ సేవ గురించి బాలయ్య ఉద్వేగంగా మాట్లాడారు. అటు ‘అఖండ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య, ఇఫీ వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. గోవా వీధుల్లో జరిగిన స్ట్రీట్ పెరేడ్ లో బాలయ్యను చూసి ఫ్యాన్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తానికి “సింహం సింగిల్ గా వచ్చినా..” అన్నట్లు గోవాలో బాలయ్య మార్క్ గర్జన గట్టిగానే వినిపించింది!

