జూబ్లీహిల్స్: నేటితో ముగిసిన ప్రచారం.. గెలుపుపై మూడు పార్టీల ధీమా!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారానికి నేటితో (ఆదివారం, నవంబర్ 9) తెరపడింది. ఈ సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబయడంతో, ఇక నిశ్శబ్ద ప్రచారం మాత్రమే జరగనుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, అన్ని ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. నెల రోజులుగా సాగిన ఈ ప్రచారం మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరుగా సాగింది.

హోరాహోరీగా ప్రచారం ఈ ఎన్నికను మూడు పార్టీలూ సీరియస్‌గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ అగ్ర నాయకులను ప్రచార బరిలోకి దింపాయి.

బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి, మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. సానుభూతి ఓటుతో పాటు, తమ పార్టీ చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నుండి వి. నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీలకు రహస్య ఒప్పందం ఉందని ఆరోపిస్తూ, అధికార పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదని కాంగ్రెస్ ప్రచారం చేసింది.

బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రచారంలో పాల్గొన్నారు. చివరి రోజు ప్రచారంలో, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే జూబ్లీహిల్స్ పేరును ‘సీతారాం నగర్’గా మారుస్తామని హామీ ఇచ్చారు.

తుది అంకానికి ఏర్పాట్లు ప్రచారం ముగియడంతో, నియోజకవర్గం వెలుపలి నాయకులు, కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. నవంబర్ 11న జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే ఉంది. ప్రచారం ముగిసినా, పార్టీలు ఇప్పుడు బూత్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాయి. ఓటర్లను పోలింగ్ బూత్‌ల వరకు రప్పించేందుకు చివరి నిమిషం వ్యూహాలు రచిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఓటరు ఎవరికి పట్టం కడతారో నవంబర్ 14న తేలనుంది.

Leave a comment