తలపతి విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ సినీరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రం సిగ్మా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కిషన్ హీరోగా లీకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్-అడ్వెంచర్ కామెడీ నేపథ్యంలో, మనీ సెంట్రిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సంజయ్ వర్క్ విధానం ఎంత పక్కాగా ఉందంటే, 65 రోజుల షూటింగ్లో దాదాపు 95 శాతం పూర్తయిందట.
ఇటీవల సందీప్ కిషన్ చేసిన వ్యాఖ్యలు జేసన్ సంజయ్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని తెలియజేశాయి. తమిళ సినిమాకి సంజయ్ వారసుడుగా నిలబడగల సత్తా ఉన్నవాడని సందీప్ కిషన్ గట్టిగా చెప్పారు. సంజయ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటే, దేశంలోనే పెద్ద దర్శకులు, సంగీత దర్శకుల కాంబినేషన్లో క్షణాల్లో సినిమా రెడీ అయిపోయేది. అంతేకాదు, ఏకంగా రూ.1000 కోట్లకు పైగా రాబట్టగలిగేంత పెద్ద సినిమాలో హీరోగా చేసే అవకాశం కూడా సంజయ్‌కు ఉండిందట.
కానీ, సంజయ్ ఇవన్నీ వదిలేసి, దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. డైరెక్షన్ వైపే తన ఆసక్తి అని, హీరోగా తనని (సందీప్ కిషన్‌ని) ఎంచుకోవాలని కోరుకున్నారని సందీప్ తెలిపారు. సంజయ్‌లో 24 ఏళ్లకే ఇంతటి ప్రతిభ, అంకితభావం చూడలేదని సందీప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజంగానే, స్టార్ డమ్‌ను వదిలి కళనే నమ్ముకున్నారు.కాబట్టి జేసన్ సంజయ్ దృష్టి కేవలం గొప్ప సినిమా చేయడమే.
ఈ సిగ్మా సినిమాకి మొదట దుల్కర్ సల్మాన్‌ను హీరోగా తీసుకోవాలని సంజయ్ అనుకున్నారట. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఈ నిర్ణయం సంజయ్‌కి తన విజన్ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా వేసవిలో వచ్చే అవకాశం ఉంది.

