‘దండోరా’ టీజర్: శివాజీ, నవదీప్ ఊరిలో ఏం జరిగింది? సస్పెన్స్ పీక్స్!

తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగే కథలకు ఈ మధ్య మంచి ఆదరణ దక్కుతోంది. ఆ కోవలోనే, ‘దండోరా’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక ఊరిలో ముడిపడిన అనేక జీవితాల సమాహారం. టీజర్ ఓపెన్ చేయగానే, ఒక గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణం చుట్టూ కథ అల్లినట్టు అర్థమవుతోంది. ‘ఒక చావు.. ఆ చావు వెనుక నిజం’ అనే థీమ్ సినిమాకు కీలకంగా నిలవనుంది.

ఈ టీజర్‌లో మనకు చాలా కథలు కనిపిస్తాయి. ఓ వైపు సర్పంచ్ చుట్టూ తిరిగే పల్లె రాజకీయాలు, మరోవైపు పరువు కోసం పోరాడే ఒక వేశ్య జీవితం, ఇంకోవైపు వికసిస్తున్న ప్రేమకథ. ఈ అన్ని కథలను ఆ ఒక్క మరణం ఎలా ప్రభావితం చేసింది? అసలు ఆ చావుకు కారకులు ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

కోర్టు సినిమా తర్వాత శివాజీకి ఇది ఒక పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. ఆయన పాత్ర చాలా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. మరోపక్క, నవదీప్ కూడా తనదైన శైలిలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. బిందు మాధవి, నందు, రవికృష్ణ వంటి వారు ఈ మల్టీ-స్టారర్‌కు బలం చేకూర్చారు. ఈమధ్య ‘బలగం’ సినిమా కూడా చావు చుట్టూ తిరిగినా, అది ఎమోషనల్ కామెడీ. కానీ ‘దండోరా’ మాత్రం పూర్తి భిన్నంగా, సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతూ, మధ్యలో కాస్త కామెడీని టచ్ చేసినట్లు అనిపిస్తుంది. ‘అసలు గొడవంతా ఎక్కడ మొదలైంది?’ అని వెతుక్కునేలా టీజర్ కట్ చేశారు.

‘కలర్ ఫోటో’కి జాతీయ అవార్డు అందుకున్న నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. దర్శకుడు మురళీకాంత్ ఒక బలమైన సామాజిక అంశాన్ని కూడా టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. “చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు.. పని మారితే కులం కూడా మారాలి కదా?” లాంటి డైలాగ్‌లు సినిమా లోతును సూచిస్తున్నాయి. మార్క్ కె. రాబిన్ సంగీతం, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ టీజర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి.

మొత్తం మీద, ‘దండోరా’ టీజర్ ఒక సాధారణ సినిమాగా కాకుండా, ప్రేక్షకులను ఆలోచింపజేసే, ఉత్కంఠకు గురిచేసే ఒక గట్టి కథతో వస్తున్నట్టు ‘దండోరా’ వేసి చెబుతోంది.

Leave a comment