‘పుష్ప’ పోలికలే స్పీడ్ బ్రేకర్లు.. పృథ్వీరాజ్ ‘విలాయత్ బుద్ధ’కి తప్పని తిప్పలు!

పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘విలాయత్ బుద్ధ’ ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి చిత్ర యూనిట్‌కి ఒకటే గోల.. “ఇది పుష్ప లాగే ఉందేంటి?” అని. అడవి, ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసుల కళ్లు గప్పే సీన్లు చూడగానే జనాలు అల్లు అర్జున్ ‘పుష్ప’తో పోల్చడం మొదలుపెట్టారు.

ప్రమోషన్స్‌లో సినిమా గొప్పతనం గురించి చెప్పడం మానేసి, “మాది పుష్ప కాపీ కాదు మొర్రో” అని చెప్పుకోవాల్సిన పరిస్థితి పృథ్వీరాజ్‌కి వచ్చింది. ఇదే ఇప్పుడు సినిమాకి పెద్ద స్పీడ్ బ్రేకర్‌లా మారింది.

దీనిపై పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ కథ జీఆర్ ఇందుగోపాలన్ రాసిన నవల ఆధారంగా ఎప్పుడో రెడీ అయ్యిందని, ‘పుష్ప’ రిలీజ్ కాకముందే దివంగత దర్శకుడు సచీ ఈ ప్రాజెక్ట్ అనుకున్నారని తెలిపారు.

సచీ మరణం తర్వాత జయన్ నంబియార్ డైరెక్షన్‌ బాధ్యతలు తీసుకున్నారు. “పుష్ప కథ వేరు, మా కథ వేరు. అక్కడ హీరో-పోలీస్ ఈగో వార్ ఉంటే, ఇక్కడ గురుశిష్యుల మధ్య చందనపు చెట్టు కోసం జరిగే యుద్ధం ఉంటుంది” అని పృథ్వీ చెప్పుకొచ్చారు.

కానీ జనాలకు మాత్రం తెరపై గొడ్డలి, దుంగలు కనిపించగానే ‘తగ్గేదే లే’ గుర్తొచ్చేస్తోంది. “కామేర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట”.. అలాగే ఇప్పుడు ఆడియన్స్‌కి ఏ అడవి సినిమా చూసినా పుష్పనే గుర్తొస్తోంది. కంటెంట్ బాగుంటే ఈ పోలికలు పక్కకు పోతాయి కానీ, ప్రస్తుతానికి మాత్రం పృథ్వీరాజ్ ఈ ‘పుష్ప’ గండం దాటాల్సిందే. రేపు సినిమా హిట్ అయితేనే ఈ ‘స్పీడ్ బ్రేకర్’ తొలగిపోతుంది.

Leave a comment