2002 ఫిబ్రవరిలో తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసిన ఘటన నటి ప్రత్యూష మరణం. ‘సముద్రం’, ‘స్నేహమంటే ఇదేరా’ వంటి చిత్రాలతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష అకాల మరణం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆమె ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డితో కలిసి విషం సేవించారని కేసు నమోదైంది. విషం తాగి ఆసుపత్రిలో చేరిన ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్ రెడ్డి చికిత్స అనంతరం కోలుకున్నాడు.
ప్రత్యూషది ఆత్మహత్య కాదు, హత్యేనని ఆమె తల్లి సరోజిని దేవి మొదటి నుంచీ గట్టిగా వాదిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారం రేపింది. మొదట్లో ఇది ఆత్మహత్యా? హత్యా? అన్న సందేహాలు బలంగా వినిపించినా, సీబీఐ విచారణలో ఇది ‘ఆత్మహత్యకు ప్రేరేపించడం’ గానే తేలింది.
ఈ కేసు విచారణ వివిధ కోర్టుల్లో సాగింది. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐదేళ్ల జైలు శిక్ష, ఆత్మహత్యాయత్నం చేసినందుకు మరో ఏడాది శిక్ష, అలాగే రూ.6 వేలు జరిమానా విధించింది.
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పును సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా, 2011లో హైకోర్టు శిక్షను ఐదేళ్ల నుంచి కేవలం రెండేళ్లకు తగ్గించింది. అయితే, జరిమానాను మాత్రం రూ.50 వేలకు పెంచి, అందులో రూ.40 వేలను తల్లికి చెల్లించాలని ఆదేశించింది. శిక్ష తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ్ రెడ్డికి గరిష్ఠ శిక్ష విధించాలని ఆమె కోరారు.
సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. న్యాయమూర్తులు జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ల ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది. సిద్ధార్థ్ రెడ్డి తరపు న్యాయవాదులు.. ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు కాబట్టి, ఆత్మహత్యకు ప్రేరేపణ అనే సెక్షన్ చెల్లదని వాదించారు. దీనిపై త్వరలోనే తుది తీర్పు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించి, తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 23 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

