ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశం ఇప్పటికే ఢిల్లీ పేలుళ్ల అలర్ట్‌తో వణికిపోతుంటే, ఇప్పుడు ఏకంగా ఓ ప్రభుత్వ పాఠశాల పక్కన కుప్పలు తెప్పలుగా పేలుడు పదార్థాలు దొరకడం కలకలం రేపుతోంది. సల్ట్ ప్రాంతంలోని డబ్రా గ్రామంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది.
బంతి వెతుక్కుంటూ వెళ్తే.. బాంబులు దొరికాయి! అసలు కథేంటంటే.. స్కూల్ పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. బంతి పొరపాటున పక్కనే ఉన్న పొదల్లో పడింది. ఆ బంతిని వెతుక్కుంటూ వెళ్లిన విద్యార్థులకు అక్కడ కొన్ని అనుమానాస్పద ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. వాటిని చూసి భయపడ్డ పిల్లలు వెంటనే ప్రిన్సిపాల్ సుభాష్ సింగ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఆ సంచుల్లో ఉన్నది చాక్లెట్లు కాదు.. ఏకంగా 161 జిలెటిన్ స్టిక్స్! వీటి బరువు దాదాపు 20 కేజీల పైమాటే.
రంగంలోకి మాలీ, రాంబో! పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ నుంచి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్ హుటాहुటిన అక్కడ వాలాయి. ముఖ్యంగా ‘మాలీ’, ‘రాంబో’ అనే రెండు జాగిలాలు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి. స్కూల్ కాంపౌండ్ నుంచి సుమారు 15-20 అడుగుల దూరంలో పొదల్లో దాచి ఉంచిన ఈ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిర్లక్ష్యమా? లేక భారీ కుట్రా? సాధారణంగా ఈ జిలెటిన్ స్టిక్స్‌ను రోడ్ల నిర్మాణంలో రాళ్లు పగలగొట్టడానికి వాడతారు. కానీ, నిత్యం వందలాది మంది పిల్లలు తిరిగే స్కూల్ పక్కన వీటిని పడేయడం ఏంటి? అని స్థానికులు మండిపడుతున్నారు. “ఇవి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో వదిలేసినవా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాచారా?” అనే కోణంలో అల్మోరా ఎస్ఎస్పీ దేవేంద్ర పించా విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి, నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

