‘బాహుబలి’ ప్రపంచం నుంచి 120 కోట్ల యానిమేషన్ చిత్రం

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’ సామ్రాజ్యం మరో సరికొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. రెండు భాగాల లైవ్-యాక్షన్ చలనచిత్రాల తర్వాత, ఇప్పుడు ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ పార్ట్-1’ పేరుతో త్రీడీ యానిమేషన్ చలనచిత్ర సిరీస్‌ను ప్రకటించారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల ‘బాహుబలి: ది ఎపిక్’  థియేట్రికల్ రీ-రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులకు సర్ప్రైజ్‌గా చూపించారు.

ఈ యానిమేషన్ చిత్రం యొక్క ప్రధాన కథాంశం అమరేంద్ర బాహుబలి జీవితంలో కీలక ఘట్టం తర్వాత మొదలవుతుంది. కట్టప్ప చేతిలో బాహుబలి మరణించిన అనంతరం, ఆయన ప్రయాణం మహిష్మతికి అవతల ఉన్న అతీత లోకాలలోకి  సాగుతుందని టీజర్ సూచించింది. పురాణ గాథలు, అధిభౌతిక అంశాలను మేళవించిన ఈ కథ… 14 భువనాలలో దేవతలు, అసురుల మధ్య జరిగే ఒక మహా విశ్వ యుద్ధం చుట్టూ తిరుగుతుంది.

ప్రభాస్ వాయిస్‌, హాలీవుడ్ స్థాయి విజువల్స్:

ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే, అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రభాస్ తన స్వరం అందించడం. టీజర్‌లో వినిపించిన ప్రభాస్ పవర్‌ఫుల్ వాయిస్, యానిమేషన్ పాత్రకు జీవం పోసింది. అంతేకాక, యానిమేషన్ నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. చాలా మంది ప్రేక్షకులు ఈ విజువల్స్‌ను ‘హాలీవుడ్ స్థాయి’లో ఉన్నాయని, ‘భారతీయ యానిమేషన్‌లో గేమ్ ఛేంజర్’ అని ప్రశంసిస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యానిమేషన్ చిత్రం, భారతీయ సినీ చరిత్రలో ఇంతటి భారీ వ్యయంతో నిర్మిస్తున్న యానిమేషన్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ ప్రతిష్టాత్మక యానిమేషన్ ప్రాజెక్ట్‌కు అవార్డు గ్రహీత, అంతర్జాతీయ యానిమేషన్ ఫిల్మ్‌మేకర్ ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ (శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని) నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా నిర్మాణం దశలో ఉన్న ఈ రెండు భాగాల యానిమేషన్ సిరీస్.. 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మహిష్మతి కథా ప్రపంచాన్ని విస్తృతం చేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ ప్రయత్నం, బాహుబలి ఫ్రాంచైజీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయనుంది.

Leave a comment