నటీనటులు: అఖిల్ ఉడ్డెమారి-తేజస్వి రావు- చైతు జొన్నలగడ్డ- శివాజీ రాజా- అనిత చౌదరి- కవిత శ్రీరంగం తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్
నిర్మాతలు: వేణు ఉడుగుల-రాహుల్ మోపిదేవి
రచన-దర్శకత్వం: సాయిలు కాంపాటి
ఈ మధ్యకాలంలో తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వచ్చే రా అండ్ రస్టిక్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. ‘బలగం’ బాటలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది నేడు విడుదలైన ‘రాజు వెడ్స్ రంబై’. ప్రమోషన్లలో దర్శకుడు సాయిలు కంపాటి చేసిన “అమీర్ పేటలో నిలబడతా” చాలెంజ్ తో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి రాజు-రంబైల ప్రేమకథ పండిందా?
కథేంటంటే: ఇదొక ఖమ్మం-వరంగల్ సరిహద్దుల్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన కథ. డప్పు కొట్టే రాజు (అఖిల్ రాజ్), కాంపౌండర్ కూతురు రాంబాయి (తేజస్విని) ప్రేమలో పడటం, కులం-అంతస్తు అడ్డురావడం, ఆ తర్వాత పారిపోవడం.. ఇవన్నీ మనకు తెలిసిన రొటీన్ వ్యవహారాలే. కానీ చివర్లో ఈ జంటకు ఎదురైన పరిస్థితి ఏంటి అన్నదే అసలు ట్విస్ట్.
విశ్లేషణ: సినిమా మొదలైన అరగంట వరకు అసలు కథ పట్టాలెక్కదు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు”.. ఫస్టాఫ్ అంతా అనవసరమైన సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో నత్తనడకన సాగుతుంది. లవ్ స్టోరీలో డెప్త్ లేకపోవడంతో ప్రేక్షకుడు ఫోన్ లో రీల్స్ చూసుకోవడం గ్యారెంటీ. సురేష్ బొబ్బిలి సంగీతం ఒక్కటే కాస్త ఊరట.
అయితే, దర్శకుడు దాచుకున్న ‘బ్రహ్మాస్త్రం’ క్లైమాక్స్ లో ఉంది. సినిమా మొత్తం ఒకెత్తు.. చివరి 20 నిమిషాలు ఒకెత్తు. గుండె బరువెక్కే రేంజులో చివర్లో ఇచ్చిన ట్విస్ట్, ఆ ఎమోషన్ ప్రేక్షకుడిని సీటుకు కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఆ ‘షాక్’ వాల్యూ కోసమే ఈ సినిమా తీసినట్లుంది. కానీ, ఆ ఒక్క క్లైమాక్స్ కోసం రెండు గంటల పాటు సాగదీతను భరించడం ప్రేక్షకుడికి పెద్ద పరీక్షే. “అందరూ బాగున్నారు.. కానీ రాతే బాగోలేదు” అన్నట్లుగా స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది.
సాంకేతిక విభాగంలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. తనదైన మార్క్ ఫోక్ బీట్స్ తో పాటలు వినసొంపుగా ఉన్నాయి, ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కెమెరామెన్ పనితనం బాగుంది, పల్లెటూరి వాతావరణాన్ని, రాత్రి పూట వచ్చే సన్నివేశాలను నేచురల్ గా చూపించారు. ఇక ఎడిటర్ గురించి చెప్పుకుంటే.. కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉండాల్సింది. ఫస్టాఫ్ లో సాగదీసిన సీన్లను లేపేస్తే సినిమా ఇంకాస్త ‘క్రిస్ప్’ గా ఉండేది. దర్శకుడు సాయిలు కంపాటి రాసుకున్న డైలాగులు సహజంగా ఉన్నా, కథనం విషయంలో తడబడ్డాడు. నిర్మాణ విలువలు సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ పంచ్: ఇది కేవలం “క్లైమాక్స్” కోసం తీసిన సినిమా. చివర్లో వచ్చే ఎమోషన్ కోసం మిగతా సినిమాను భరించగలిగితే ఒకసారి ట్రై చేయొచ్చు. మాస్ ఆడియన్స్ కి, తెలంగాణ నేటివిటీ నచ్చేవారికి పర్లేదు అనిపిస్తుంది. కానీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మాత్రం ఇది “మల్టీ విటమిన్ టాబ్లెట్” లాంటిది.. మింగలేం, అలాగని ఉయలేం!
SkyC Rating : 2.5/5

