విషాద వార్త: ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ కన్నుమూత!

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో, కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.

ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. ఆయన 1960లో నల్గొండ జిల్లాలో జన్మించారు అందెశ్రీ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఆయన ఏనాడూ బడికి వెళ్లి చదువుకోలేదు. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి, ప్రకృతి నుండే జ్ఞానాన్ని పొందారు.

తన అపారమైన ప్రతిభతో అద్భుతమైన జానపద గీతాలను, కవితలను రచించారు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” పాట, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ గీతాన్నే రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం గుర్తించింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సోమవారం ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ, అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.

అందెశ్రీ కేవలం తెలంగాణ గీతానికే పరిమితం కాలేదు. ఆయన రాసిన “పల్లె కన్నీరు పెడుతుందో” వంటి అనేక పాటలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. 2006లో ‘గంగ’ సినిమాకు గానూ ఆయన నంది పురస్కారం అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన పాట తెలంగాణ ఉన్నంత కాలం బతికే ఉంటుంది. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment