వైజాగ్‌లో దారుణం: ‘దొంగ పోలీస్’ ఆట పేరుతో అత్తను కాల్చేసిన కోడలు!

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో అత్యంత దారుణమైన హత్య జరిగింది. అత్త వేధింపులు తాళలేక, ఓ కోడలు ఆమెను కిరాతకంగా హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే, అప్పన్నపాలెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జయంతి కనకమహాలక్ష్మి (63) నివసిస్తున్నారు. ఆమె కుమారుడు సుబ్రహ్మణ్యం (ఒక పూజారి) మరియు కోడలు లలితా దేవి (30) కూడా వారితోనే ఉంటున్నారు. కొంతకాలంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంటి పనుల విషయంలో అత్త తనను నిత్యం వేధిస్తోందని లలిత ఆరోపించింది. ఈ క్రమంలో, అత్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె యూట్యూబ్‌లో “వృద్ధులను ఎలా చంపాలి” అని వెతికింది.

ఒక పక్కా ప్రణాళిక ప్రకారం, నవంబర్ 6న ఆమె పెట్రోల్ కొనుగోలు చేసింది. మరుసటి రోజు ఉదయం (శుక్రవారం), భర్త బయటకు వెళ్లిన తర్వాత, తన ప్లాన్ అమలు చేసింది. తన 8 ఏళ్ల కుమార్తెతో కలిసి ‘దొంగ పోలీస్’ ఆట ఆడుదామని అత్తను నమ్మించింది. ఆటలో భాగంగా, కనకమహాలక్ష్మిని ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. పిల్లలతో కలిసి ఆమె కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత, కూతురిని మరో గదిలోకి పంపింది. వెంటనే, అత్తపై పెట్రోల్ పోసి, దేవుడి గదిలోని దీపం వత్తితో నిప్పంటించింది. అత్త కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు టీవీ సౌండ్ గట్టిగా పెట్టింది.

తొలుత, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. టీవీలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నాయని కట్టుకథ అల్లింది. అయితే, పోలీసులకు ఘటనా స్థలంలో పెట్రోల్ వాసన రావడంతో అనుమానం వచ్చింది. వారి దర్యాప్తులో, నిందితురాలి ఫోన్‌లోని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ బయటపడింది. దీంతో, ల లితా దేవి తన నేరాన్ని అంగీకరించింది.ఈ దారుణంలో, మంటల్లో ఉన్న నానమ్మ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిందితురాలి కుమార్తెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. పెందుర్తి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Leave a comment