తిరుమలలో సాయి దుర్గ తేజ్.. వచ్చే ఏడాదే పెళ్లి!

మెగా ఫ్యామిలీ హీరో సాయి దుర్గ తేజ్ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సాయి దుర్గ తేజ్ ఒక శుభవార్త పంచుకున్నారు. ఎప్పటినుంచో ఆయన పెళ్లి గురించి అభిమానుల్లో, ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నకు ఆయన ఎప్పుడూ నవ్వుతూ దాటవేసేవారు. కానీ ఈసారి తిరుమల సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. “వచ్చే ఏడాది నా వివాహం జరుగుతుంది” అని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా, తనకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకే తిరుమల వచ్చానని ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా, శ్రీవారి ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘నిదానమే ప్రధానం’ అన్నట్టు, సరైన సమయానికే అన్నీ ప్రకటించడం తేజ్ శైలి.

ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ, “సంబరాల ఏటి గట్టు” సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ పాన్-ఇండియా చిత్రంపై తనకు మంచి నమ్మకం ఉందని సాయి దుర్గ తేజ్ ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

Leave a comment