దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల తన కొత్త సినిమా ‘వారణాసి’ గ్లింప్స్ విడుదల ఈవెంట్‌కు హాజరైనప్పుడు చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. వారణాసిలో జరిగిన ఈ వేడుకలో, సాంకేతిక లోపం కారణంగా గ్లింప్స్ ఆలస్యం కావడంతో రాజమౌళి తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘సినిమా వెనుక హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని’ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, “నాకు దేవుడిపై నమ్మకం లేదు. హనుమంతుడే ఉంటే ఇలా ఎందుకు జరిగేది?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మాటలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రాజమౌళి వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దేవుడిపై నమ్మకం లేని రాజమౌళి పౌరాణిక ఇతివృత్తాలతో సినిమాలు తీసి ఎలా సొమ్ము చేసుకుంటున్నారని నిలదీశారు. రాష్ట్రీయ వానరసేన సంఘం ఏకంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులకు ఆయనపై ఫిర్యాదు కూడా చేసింది. దీనికి తోడు, రాజమౌళి పాత ట్వీట్లు కూడా తెరపైకి వచ్చి వివాదాన్ని మరింత రాజేశాయి.
ఈ వివాదంపై ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది.. ప్రియదర్శి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్పందించారు. ఆయన హైపర్ ఆది రాజమౌళికి మద్దతు తెలుపుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి దేవుడిని అవమానించలేదని, కేవలం సాంకేతిక సమస్యపై నిరాశ చెంది, హనుమంతుడిపై అలిగారని ఆది తేల్చి చెప్పారు. “ఆయన అలా మాట్లాడలేదు, కేవలం గ్లిచ్‌పై కోపంతో ఆ మాట అన్నారు” అని ఆది వివరించారు. వ్యక్తులపై బురదజల్లడం సరికాదన్నారు.
ఇదే సందర్భంలో సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై ఆది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమౌళితో పాటు ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్లపై కూడా అనవసరమైన విమర్శలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
“ఇది మన సంస్కృతి కాదు. ఏమైనా విమర్శలు చేయాలంటే ఒక పరిమితిలో ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ (అతి అన్నిటికీ పనికిరాదు) అన్నట్లుగా, సెలబ్రిటీల ప్రతీ అంశాన్ని ట్రోల్ చేయడం మానుకోవాలి” అని ఆది గట్టిగా కోరారు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత నమ్మకాలపై కాకుండా, నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు.

